మల్టీప్లెక్సుల్లో A సర్టిఫికెట్ గొడవలు

ఏ సినిమాకైనా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే థియేటర్లలో కేవలం 18 వయసు దాటిన వాళ్ళను మాత్రమే అనుమతించాలి. లేదంటే సదరు యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు, ప్రభుత్వానికి ఉంటుంది. అయితే సింగల్ స్క్రీన్లలో దీన్ని అంతగా పట్టించుకోరు. టికెట్లు తెగితే చాలు కౌంట్ చేసుకుని లోపలికి పంపడం తప్ప ఆడియన్స్ వయసుని అలా ఒక క్షణం పాటు చూసేంత తీరిక, ఓపిక ఉండవు. కానీ మల్టీప్లెక్సులు సాధ్యమైనంత మేరకు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాయి. కానీ సలార్ విషయంలో మాత్రం ఇది తలనెప్పిగా మారిపోయింది.

ఇటీవలే హైదరాబాద్ లో రెండు ఉదంతాలు జరిగాయి. గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ మల్టీప్లెక్సులో రద్దీ ఎక్కువ రావడంతో జనాన్ని ఆదరాబాదరాగా లోపలికి పంపించారు. తీరా చూస్తే చిన్నపిల్లలు కూడా పెద్దలతో పాటు వచ్చారని గుర్తించి షో వేయలేదు. 45 నిముషాలు పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత పోలీసులు వచ్చి సర్దిచెప్పేదాకా వెళ్ళింది పరిస్థితి. కూకట్ పల్లి ప్రాంతంలోని మరో సముదాయంలో పదేళ్ల కొడుకును తీసుకొచ్చిన తల్లి తను ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నాను కాబట్టి మమ్మల్ని ఆపే హక్కు లేదంటూ మేనేజర్, సిబ్బందితో గొడవ పడటం వీడియోలో వచ్చేసింది.

నిజానికి ప్రభాస్ సినిమా కాబట్టే జనాలు ఏ సర్టిఫికెట్ అనేది చెక్ చేసుకోకుండా వెళ్లిపోతున్నారు. పైగా సలార్ కు వచ్చిన టాక్ కుదురుగా ఉండనివ్వడం లేదు. నిజానికి ఇందులో పిల్లలు జడుసుకునేంత, పెద్దలు సిగ్గు పడేంత కంటెంట్ ఏమి లేదు. ప్రశాంత్ నీల్ ఈ విషయంలో జాగ్రత్తగానే ఉన్నాడు. కాకపోతే వయొలెన్స్ ఎక్కువగానే ఉంది. అలా అని ఇప్పటిదాకా తెరమీద ఎవరూ చూపలేనంత దారుణంగా అయితే కాదు. సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్ళది ఇదే అభిప్రాయం. ఇకపై కనీసం యు/ఏ రానిదే ప్రభాస్ రేంజ్ హీరోలతో థియేటర్ల సిబ్బందికి తిప్పలు తప్పేలా లేవు