ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. సందీప్ కిషన్- విఐ ఆనంద్ కలయికలో మొదలైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మీద కూడా ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాట “నిజమే నే చెబుతున్నా” పాట సంగీత ప్రియులను విపరీతంగా కట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాట వల్ల సినిమాకు మంచి బజ్ కూడా వచ్చింది.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సందీప్ కిషన్ కెరీర్‌కు కీలకమైన ఈ సినిమా గురించి ఏ సమాచారం లేకపోవడంపై తన అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. అయితే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.
వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే వీకెండ్ కు ముందుగా ఊరు పేరు భైరవకోనను రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సందీప్ కిషన్ ట్విట్టర్ లో ప్రకటించాడు. మూడేళ్ల కష్టం, ఎన్నో ఏళ్ల కల ఆ రోజు నెరవేరుతుందంటూ సందీప్ కిషన్ ఎమోషనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.
గత ఏడాది వ్యవధిలో కాంతార, విరూపాక్ష, మా ఊరి పొలిమేర-2 లాంటి మిస్టరీ థ్రిల్లర్లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో అదే జానర్లో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విరూపాక్ష మూవీతో పోలికులుండటం వల్లే స్క్రిప్టులో మార్పులు చేసి రీషూట్లు చేస్తున్నారని, అందుకే రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇటీవల రూమర్లు వినిపించాయి. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. విరూపాక్షతో తమ సినిమాకు పోలికేమీ లేదని వీఐ ఆనంద్ స్పష్టం చేశాడు. జానర్ ఒక్కటైనంత మాత్రాన కథలు ఒకలా ఉండవని అతనన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే సినిమా రిలీజ్ లేటవుతోందని ఆనంద్ తెలిపాడు. కొన్నేళ్ల కిందట ఎక్కడికి పోతావు చిన్నవాడాతో బ్లాక్ బస్టర్ మళ్లీ అలాంటి సినిమాను డెలివర్ చేస్తాడని సందీప్ కిషన్ అభిమానులు ఆశిస్తున్నారు.