సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అందరికంటే చిన్న హీరో ఎవరయ్యా తేజ సజ్జనే. అయినా సరే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు మాత్రం తమ కంటెంట్ మహేష్ బాబు, రవితేజ, నాగార్జునలకు గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. జనవరి 12 గుంటూరు కారం ఉన్నప్పటికీ దానికి ముందో వెనకో రాకుండా ఏకంగా అదే రోజు క్లాష్ కి సై అంటున్నాడు హనుమాన్. డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని థియేటర్లు కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. మిగిలినవి వద్దనుకుని దీని మీద పెట్టుబడి పెట్టిన బయ్యర్లందరి కళ్ళు ఇప్పుడు ట్రైలర్ మీద ఉన్నాయి.
డిసెంబర్ 19న హైదరాబాద్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజువల్స్ నిజంగానే కట్టిపడేసేలా ఉన్నాయట. టీజర్ ఎన్నో నెలల క్రితమే వచ్చింది. ప్రామిసింగ్ గా అనిపించింది కానీ మరీ బడా హీరోలతో తలపడేంత ఫీల్ అప్పుడు ఎవరికి అనిపించలేదు. ఇప్పటి లెక్కలు వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ లేదా సెకండ్ ఛాయస్ గా మారాలంటే వచ్చే వారం వదిలబోయే మూడు నిమిషాల వీడియోలో కీలకమైన అంశాలు రివీల్ చేయాలి. తేజ సజ్జ కోసం వచ్చే వాళ్ళు తక్కువ. హనుమాన్ అనే భక్తి భావమే జనాన్ని టికెట్లు కొనేలా చేయాలి.
అందుకే ప్రశాంత్ వర్మ ట్రైలర్ కట్ కోసం చాలా హోమ్ వర్క్ చేశాడని చెప్పుకుంటున్నారు. గుంటూరు కారంతో పాటు ఈగల్, నా సామిరంగా, సైంధవ్ కంటే ముందు వస్తున్నందున ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాల్సిన ఒత్తిడి హనుమాన్ ట్రైలర్ మీద ఉంది. అసలే ఆదిపురుష్ ని తప్పుగా హ్యాండిల్ చేయడం వల్ల ఓం రౌత్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. కానీ హనుమాన్ ఫాంటసీ మిక్స్ కాబట్టి ఆ రిస్క్ లేదు కానీ గ్రాఫిక్స్ ని ఎమోషన్స్ ని ఎలా బ్యాలన్స్ చేశాడనేది కీలకంగా మారనుంది. దిగ్గజాల మధ్య పోటీకి దిగుతున్న తేజ సజ్జకి ఇది నిజంగా అగ్ని పరీక్షే. గెలిస్తే మాత్రం కెరీర్ పరంగా పెద్ద సెటిల్మెంటే.