చిరు ఫ్యామిలీని కలిసిన నెట్ ఫ్లిక్స్ CEO

ఇవాళ హైదరాబాద్ వచ్చిన అంతర్జాతీయ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు రామ్ చరణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు సదరు సంస్థ కీలక ప్రతినిథులు పాల్గొన్నారు. అయితే అజెండా ఏంటనేది బయటికి రాలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని తెలిసింది. హిందీ ఆర్ఆర్ఆర్ కు నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ అమోఘమైన స్పందన దక్కింది. ఆస్కార్ వచ్చాక మిలియన్ల వ్యూస్ వెల్లువలా ఆ ఓటిటిని ముంచెత్తాయి.

నిజానికి నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మార్కెట్ ని పెంచుకునేందుకు తీవ్ర ప్రణాళికలు వేస్తోంది. కేవలం తెలుగు తమిళ సినిమాల మీదే ఈ ఏడాది 800 కోట్లకు పైగా పెట్టుబడిని హక్కుల కోసం ఖర్చు పెట్టింది. ఎన్నడూ లేనిది ఈ సంవత్సరమే అత్యధిక పెద్ద చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చాయి. షూటింగ్ దశలో ఉండగానే భారీ ఆఫర్లు ఇచ్చి మరీ రైట్స్ సొంతం చేసుకునే ఎత్తుగడని గత కొన్ని నెలలుగా పాటిస్తోంది. వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లను కొన్నది ఈ కంపెనీనే. మైత్రి మూవీ మేకర్స్ సైతం అమెజాన్ ప్రైమ్ నుంచి షిఫ్ట్ అయిపోయి పుష్ప 2 కూడా ఇచ్చేశారు.

ఒరిజినల్ కంటెంట్ సృష్టించే క్రమంలో భాగంగా ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు నిర్మించే ప్లాన్ లో ఉంది నెట్ ఫ్లిక్స్. చరణ్, చిరులతో కొన్ని ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలిసింది. టెడ్ ఇండియాలో ఉండేది కొద్దిరోజులు అయినా తెలుగు తమిళ హిందీకి సంబంధించిన అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలను కలుస్తారని తెలిసింది. ఒప్పందాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. వెంకటేష్, రానాలతో ఆల్రెడీ రానా నాయుడు తీసిన నెట్ ఫ్లిక్స్ త్వరలో రెండో సీజన్ కి ప్లాన్ చేస్తోంది. భారతీయ శైలిలో నాన్ వెజ్ వంటకాలను టెడ్ కి రుచి చూపించినట్టు ఇన్ సైడ్ టాక్