నానితో బలగం వేణు ‘ఎల్లమ్మ’

ఎలాంటి అంచనాలు లేకుండా అందరూ సపోర్టింగ్ ఆర్టిస్టులతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు తీసిన బలగం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిన వసూళ్లు భారీ లాభాలు కురిపించాయి. అప్పటి నుంచి ఇతని రెండో సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఉండిపోయింది. దిల్ రాజుకే లాకయ్యాడు కానీ హీరో ఎవరనేది తెలియలేదు. దానికి సంబంధించి మెల్లగా క్లారిటీ వస్తోంది. ఎల్లమ్మ పేరుతో వేణు తయారు చేసుకున్న ఒక కథ నాని కోసం సిద్ధంగా ఉంది. నెరేషన్ కాగానే పట్టాలు ఎక్కేది లేనిది తేలనుంది.

హాయ్ నాన్న ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. బలగం చూశాక ఒక డైమండ్ ని ఇంత కాలం మిస్ చేసుకున్న ఫీలింగ్ కలిగిందని, ఎల్లమ్మ ఇంకా వినలేదని, ఏ మాత్రం అవకాశమున్నా వదులుకోనని స్పష్టంగా చెప్పాడు. సో దిల్ రాజు టీమ్ చెబుతున్న దాని ప్రకారం ఎల్లమ్మ మాస్, ఎమోషన్స్ రెండూ ఉన్న బలమైన సబ్జెక్టు కాబట్టి న్యాచురల్ స్టార్ నో అనకపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. హాయ్ నాన్న తర్వాత సరిపోదా శనివారంతో నాని బిజీ అవుతాడు. అది పూర్తవ్వగానే తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది.

దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కొత్త స్క్రిప్ట్ తో ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ వేణు కనక ఎల్లమ్మతో ఒప్పించే పనైతే 2024 మధ్యలో ప్రారంభించే సూచనలున్నాయి. బలగం లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన వేణుకి నాని ద్వారా ప్రమోషన్ రావడం కంటే పెద్ద ఘనత ఏముంటుంది. పైగా దిల్ రాజు బ్యానర్ కాబట్టి బడ్జెట్ పరంగా టెన్షన్ ఉండదు. దీని కోసమే ఏడు నెలలుగా వేణు ఎదురు చూస్తున్నారు. స్వయంగా నానినే ఓపెనయ్యాడు కాబట్టి త్వరలోనే శుభవార్త వినొచ్చేమో. ఏడాదికి కనీసం మూడు సినిమాలు ఉండేలా నాని ప్లానింగ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు.