వార్ 2లో క్యామియోలు ఉండవు

స్పై యూనివర్స్ పేరుతో యష్ రాజ్ ఫిలిమ్స్ తీస్తున్న సినిమాల్లో మొదటిసారి టైగర్ 3 రూపంలో పెద్ద ఝలక్ తగిలింది. వసూళ్ల లెక్కలను చూపిస్తూ బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవల్ లో పూర్తి పాజిటివ్ టాక్ రాలేదన్నది వాస్తవం. నిర్మాత ఆదిత్య చోప్రా తప్పెక్కడ జరిగిందో అర్థం చేసుకుని ఇకపై పొరపాట్లకు తావివ్వకూడదని నిర్ణయించుకున్నారని ముంబై టాక్. పఠాన్ లో టైగర్ ఎపిసోడ్ కి థియేటర్లు షేక్ కావడం చూసి అదే తరహాలో టైగర్ 3లో పఠాన్ ని తీసుకొచ్చారు. ఇది ప్రేక్షకులకు రిపీట్ అనిపించిందే తప్ప ఆశించినంత కిక్ ఇవ్వలేదు.

దీంతో ఇకపై క్యామియోలు పెట్టే విషయంలో స్క్రిప్ట్ స్వయంగా రాస్తున్న ఆదిత్య చోప్రా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందబోయే వార్ 2లో ఎలాంటి అతిథి పాత్రలు పెట్టబోవడం లేదు. ఈ ఇద్దరే ప్యాన్ ఇండియా స్టార్లు కాబట్టి అదనంగా ఇంకొకరిని తీసుకువచ్చి ఆడియన్స్ ని డైవర్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ టైగర్ 3 వెయ్యి కోట్లు సాధించి ఉంటే వార్ 2లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ మెరిసేవాళ్ళు. కానీ ఫలితం తారుమారు కావడంతో ఏకంగా కథలోనే మార్పులు జరుగుతున్నాయి.

ఇక్కడితో ఆగలేదు. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న టైగర్ VS పఠాన్ ని సైతం యష్ ఫిలిమ్స్ పెండింగ్ లో పెట్టిందట. షారుఖ్ సల్మాన్ కలయికని ఫుల్ లెన్త్ లో స్క్రీన్ మీద చూపించాలంటే ఆషామాషీ స్టోరీతో కుదరదు. పైగా టైగర్ 3 తిరస్కారానికి గురయ్యింది కాబట్టి క్రేజ్ విషయంలో హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకే వచ్చే ఏడాది వదిలేసి వార్ టూ 2025 జనవరిలో రిలీజయ్యాక అప్పుడు దాని గురించి ఆలోచిస్తారని తెలిసింది. అయినా ఏదో జనం ఒక్కసారి ఆదరించారని పదే పదే ఒకే తరహా ఇండియా పాకిస్థాన్ గూఢచారి కథలను రుద్దుతామంటే ఇలాగే జరుగుతుంది. ఇదీ ఒక రకంగా మంచిదే.