ఉదయం అల్లు అరవింద్ స్పష్టత ఇచ్చిన కొద్ది గంటల్లోనే తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ గోవా అవార్డుల ఘటన గురించి తీవ్రంగా స్పందించింది. జర్నలిస్ట్- టిఎఫ్సీసి, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుడు – తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సురేష్ కొండేటిని ఉద్దేశించి జరిగిన తప్పులను స్పష్టంగా వివరిస్తూ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేరుతో ఒక లేఖను విలేఖరుల సంఘానికి పంపింది. దాని ప్రధాన సారాంశం ఇది. 3 డిసెంబర్ గోవాలో జరిగిన 23వ సంతోషం అవార్డుల ఫంక్షన్ కు తెలుగు సినీ పరిశ్రమ పేరు చెప్పి అనుమతులు తీసుకున్నారు.
ఎన్నో కంపెనీలు, వ్యక్తులు ఇందులో స్పాన్సర్లుగా భాగమయ్యారు. టాలీవుడ్ బ్రాండ్ మీదే ఇదంతా జరిగింది. అయితే స్థానికంగా ఉండే సంఘాలతో సమన్వయం చేసుకోకుండా, వేడుకకు పని చేసిన వాళ్లకు డబ్బులు చెల్లించడంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తాయి . క్యాబ్ డ్రైవర్లకు సైతం అద్దెలు చెల్లించకపోవడం సమస్యను తీవ్రతరం చేసింది. ఎందరో సెలబ్రిటీలు అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు హోటల్ లో ప్రవేశించడానికి అనుమతి దొరకలేదు. కారణం అక్కడ చెల్లించాల్సిన బాకీలు ఉండిపోవడమే. అల్లు అరవింద్ తో పాటు దామోదర్ ప్రసాద్ దీన్ని పరిష్కరించగలిగారు.
మూడో తేదీ రాత్రి ఒంటి గంటకు హోటల్ రూమ్స్ కు బయలుదేరిన ఆర్టిస్టులను డ్రైవర్లు అడ్డుకున్నారు. అందులో మహిళలు ఉన్నారు. మధ్యాన్నం మూడుకు ప్రారంభం కావాల్సిన ఈవెంట్ ఏర్పాట్లలో అలసత్వం, ఆర్థిక వ్యవహారాల వల్ల రాత్రి ఎనిమిదికి మొదలైంది. గంట తర్వాత అల్లు అరవింద్ వేదిక మీద ఉండగానే సప్లయర్స్ పవర్ కట్ చేశారు. తిరిగి పునరుద్దరించే సమయానికి సురేష్ నాలుగో తేదీ తెల్లవారుఝామునే ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్స్ తీయడం లేదు. దీని వల్ల గోవా ప్రభుత్వంలో చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. మళ్ళీ ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోగలరు.