ఇంకో మూడు రోజుల్లో హాయ్ నాన్న వచ్చేస్తాడు. ఎడతెరిపి లేకుండా నాని చేస్తున్న ప్రమోషన్లు కొలిక్కి రాబోతున్నాయి. ఈ వీకెండ్ అమెరికా బయలుదేరబోతున్న న్యాచురల్ స్టార్ అక్కడ తన సినిమాను ఎన్ఆర్ఐలకు మరింత దగ్గర చేయబోతున్నాడు. ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే ఆలోచనలో దర్శక నిర్మాత సీరియస్ గా ఉన్నారని యూనిట్ టాక్. ప్రస్తుతానికి హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో ఒక షోని బుక్ చేసినట్టుగా తెలిసింది. ఆరో తేదీ రాత్రి మరికొన్ని థియేటర్లతో పాటు ఏపి తెలంగాణలోని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శించే ఆప్షన్ ని పరిశీలించి రేపు ఒక నిర్ణయం తీసుకోవచ్చని వినికిడి.
గతంలో ప్రీమియర్లు హిట్ సెంటిమెంట్ గా ఉండేవి. వాటికొచ్చే స్పందన ఓపెనింగ్స్ కి చాలా ఉపయోగపడేవి. మేజర్ నుంచి బలగం దాకా ఇలా సక్సెస్ అయినవి ఎన్నో ఉన్నాయి. అలాని అన్నింటికి ఒకటే రెస్పాన్స్ లేదు. మొన్నామధ్య రంగబలి ఇటీవల ఆదికేశవ రెండూ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి బోల్తా కొట్టాయి. కానీ హాయ్ నాన్న కేసు వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని మీద మంచి బజ్ ఉంది. జానర్ సంగతి పక్కన పెడితే స్పెషల్ షోలు వేస్తే ఎక్కడైనా ఫుల్ చేయించే మార్కెట్ నానికి ఉంది. కాబట్టి నిర్మాతకు ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు. ఎటొచ్చి ఎన్ని వేయాలనేదే ప్రశ్న.
కేవలం ఒక్క రోజు గ్యాప్ తో నితిన్ ఎక్స్ ట్రాడినరీ పోటీ ఉండటంతో హాయ్ నాన్నకు సోలో అడ్వాంటేజ్ లేదు. పైగా యానిమల్ అంత సులభంగా నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. సోమవారం కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడమంటే మాటలు కాదు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో. అందుకే హాయ్ నాన్నకు అదిరిపోయే టాక్ రావడం కీలకం. అదేదో బుధవారం రాత్రికే సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఆకర్షణ కాబోతున్నాయి.