ఆ నటుడి రాత మార్చేసిన సందీప్ వంగ

బాబీ డియోల్.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ.. స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. హీరోగా నిలదొక్కుకోలేక క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా చేసినప్పటికీ.. సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడ్డాడు. ఈ తరం ప్రేక్షకులకు అతను కనెక్ట్ కాలేకపోయాడనే చెప్పాలి. అందరూ అతణ్ని మరిచిపోతున్న సమయంలో ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు ఈ సీనియర్ నటుడు.

ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎంచుకోవడం ద్వారా బాబీ డియోల్ కెరీర్‌నే సందీప్ రెడ్డి వంగ మార్చేశాడని చెప్పాలి. తన కెరీర్ ఏమంత బాగా లేని, తన చేతిలో పెద్దగా వర్క్ లేని సమయంలో సందీప్ ‘యానిమల్’లో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పాడు బాబీ డియోల్. ఈ చిత్రంలో తాన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. ఇలాంటి పాత్ర తనకు ఇచ్చినందుకు సందీప్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అతను ఎమోషనల్‌గా చెప్పాడు.

‘యానిమల్’ ట్రైలర్లో రణబీర్ తర్వాత ఎక్కువ హైలైట్ అయింది బాబీ డియోలే. ఇందులో పాత్ర కోసం స్వీట్స్ మానేసి, అనేక ఆహార నియమాలు పాటించి, వర్కవుట్లు చూసి చిజిల్డ్ బాడీలోకి మారాడు బాబీ డియోల్. ఈ పాత్రకు రిలీజ్ కంటే ముందే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ అతడికి ఆఫర్లు వరుస కడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో చేయబోయే తెలుగు చిత్రంలో అతనే విలన్ పాత్ర పోషించబోతున్నాడు. హిందీలో కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట బాబీకి. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడికి మరింత డిమాండ్ ఏర్పడవచ్చు.