సందీప్ రెడ్డిని న‌టుడిగా చూశారా?

సందీప్ రెడ్డి వంగ‌.. ఇప్పుడు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టిదాకా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అత‌డి సినిమాల సంఖ్య రెండే. అది కూడా ఒక క‌థ‌నే రెండు భాష‌ల్లో తీశాడు. కానీ అత‌ను యూత్‌లో తెచ్చుకున్న క్రేజ్ మాత్రం అలాంటిలాంటిది కాదు.

తెలుగులో అర్జున్ రెడ్డితో సెన్సేష‌న్ క్రియేట్ చేసి.. హిందీలో అదే క‌థ‌తో తీసిన క‌బీర్‌సింగ్‌తో అక్క‌డా సంచ‌ల‌నం రేపి.. ఇప్పుడు యానిమ‌ల్‌తో మ‌రింత‌గా ప్ర‌కంప‌న‌లు రేపేలా క‌నిపిస్తున్నాడు సందీప్. ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఇంత హైప్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఇంకెవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదేమో.

యానిమ‌ల్ సినిమా ఇంకా రిలీజ్ కాక‌పోయినా.. కేవ‌లం టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తోనే అత‌ను ప్ర‌కంప‌న‌లు రేపాడు. ఈ శుక్ర‌వారం భారీ అంచ‌నాల‌తో విడుద‌ల కానున్న యానిమ‌ల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌చ్చితంగా భారీ విజ‌యం అందుకుంటుంద‌న్న అంచ‌నాలున్నాయి.

ఓవైపు యానిమ‌ల్ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమ‌యంలోనే.. సందీప్ రెడ్డికి సంబంధించిన వేరే వీడియోలు తెగ తిరిగేస్తున్నాయి. అందులో ఒక‌టి అత‌ను న‌టుడిగా క‌నిపించిన వీడియో కావ‌డం విశేషం. సందీప్ ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందు అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన కేడి సినిమాకు దర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేశాడు.

అత‌ను అసిస్టెంట్‌గా చేసిన ఏకైక చిత్రం ఇదే. కిర‌ణ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ఐతే ఈ చిత్రంలో ఒక చిన్న సీన్లో సందీప్ న‌టుడిగా క‌నిపించాడు. నావీ పోలీసులు స్మ‌గ్ల‌ర్లున్న బోట్ మీద దాడి చేస్తే ఆ బోట్‌లో సందీప్ కూడా ఉంటాడు.

ఆ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కొంచెం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే త‌ప్ప అందులో ఉన్న‌ది సందీప్ అనే విష‌యం ప‌సిగ‌ట్ట‌లేం. సందీప్ న‌టుడు కూడానా అంటూ ఈ వీడియో చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.