ప్రభాస్ స్పిరిట్ ఊహించుకుంటేనే జలదరింపు

అర్జున్ రెడ్డి రీమేక్ చేసే టైంలో హిందీ రివ్యూయర్లు దాన్ని వయొలెంట్ సినిమాగా వర్ణించడం చూసి దర్శకుడు సందీప్ వంగా అసలు హింస అంటే ఏంటో తర్వాతి మూవీలో చూపిస్తానని చెప్పిన వీడియో తాజాగా వైరలవుతోంది. దానికి కారణం అనిమల్ ట్రైలర్. రన్బీర్ కపూర్ విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి కొడుకుల సెంటిమెంట్ మీద ఇలాంటి డ్రామా కూడా తీయొచ్చా అని బాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా షాకిచ్చాడు. దీని దెబ్బకు అనుకున్న దానికన్నా ముందుగా మొదలైన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

దీనికే ఇలా ఉంటే సందీప్ నెక్స్ట్ చేయబోయే ప్యాన్ వరల్డ్ మూవీ స్పిరిట్. భయమే లేని ఒక కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ కథని చెప్పబోతున్నాడు. ప్రభాస్ మ్యాన్లీ హీరోయిజం తోడైతే తెరమీద జరిగే విధ్వంసం ఊహకు అందదు. బాహుబలి తర్వాత డార్లింగ్ పూర్తి కెపాసిటీని వాడుకున్న దర్శకుడు ఎవరూ లేరు. సుజిత్, రాధాకృష్ణ, ఓం రౌత్ ఒకరిని మించి మరొకరు నిరాశ పరిచారు. ప్రశాంత్ నీల్ వల్ల సలార్ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి భయం లేదు. తర్వాత కల్కి, మారుతీ డైరెక్షన్ సినిమాలున్నాయి. వీటి ఫలితాల పట్ల ఏ స్థాయిలో అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు.

స్పిరిట్ కూడా పక్కా సందీప్ వంగా స్టైల్ లో వయొలెంట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. రన్బీర్ కపూర్ రేంజ్ హీరోకే ఇంత హైప్ తేగలిగినప్పుడు ప్రభాస్ ని హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అయితే స్క్రిప్ట్ ఏ దశలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపుగా సిద్ధమైపోయిందని ఇన్ సైడ్ టాక్. సందీప్ అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అధికారికంగానే ప్రకటించాడు. నిర్మాణానికి మరీ సంవత్సరాల తరబడి టైం తీసుకోడు కానీ ఎటొచ్చి రాసుకోవడానికి ఎక్కువ సమయం కావాలి. ఎలా చూసుకున్నా స్పిరిట్ వచ్చేది 2025 తర్వాతే.