కన్నప్ప కోసం పెన్ను పట్టిన విష్ణు

మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, మల్టీ స్టారర్ గా రూపొందుతున్న కన్నప్ప ప్రీ లుక్ ఇవాళ విడుదల చేశారు. గెటప్ తాలూకు పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ మంచు శివలింగం ముందు ధనుస్సు ధరించిన కన్నప్ప ను ఎక్కువగా రివీల్ చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. టీమ్ కి సంబంధించి ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు కొన్నున్నాయి. వాటిలో ప్రధానమైంది ఈ ప్యాన్ ఇండియా మూవీకి రచన విష్ణునే స్వయంగా చేసుకోవడం. తనికెళ్ళ భరణి తయారు చేసిన కథకు ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు తదితర పనులు విష్ణు చూసుకున్నాడు.

ఇలా హీరోలే కలం పట్టుకోవడం ఇప్పటి జనరేషన్ లో తక్కువే. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు విషయంలో ఇచ్చిన ఇన్వాల్వ్ మెంట్ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. నవీన్ పోలిశెట్టి తన దర్శకులకు మంచి ఇన్ ఫుట్స్ ఇవ్వడం ఎంత ప్లస్ అవుతోందో చూస్తున్నాం. ఎస్ఆర్ కల్యాణమండపంకి కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ అంతా తనే రాసుకున్నాడు. ఇప్పుడు విష్ణు వంతు వచ్చింది. అయితే ఇది పైన చెప్పినవాళ్లందరి కన్నా రిస్క్ తో కూడిన వ్యవహారం. కన్నప్ప లాంటి వీర భక్తుడి గాథకు తెరకు అనుగుణంగా మార్చాలంటే దానికి తగిన కసరత్తు బలంగా జరగాలి.

ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి క్రేజీ తారాగణం కన్నప్పలో భాగం కాబోతున్నారని రెండు నెలల క్రితమే ప్రచారం జరిగింది. కథా విస్తరణ పరుచూరి గోపాలకృష్ణతో మరో ముగ్గురు చేయగా, మణిశర్మ – స్టీవెన్ డెవాస్సి సంగీతం సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం బాధ్యతలు షెల్డన్ చాకు ఇచ్చారు. స్వదేశీ విదేశీ నిపుణులతో హై క్వాలిటీతో రూపొందుతున్న కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఇటీవలే ప్రమాదంలో గాయపడిన విష్ణు తిరిగి కోలుకుని షూటింగ్ కొనసాగిస్తున్నాడు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్పని తీర్చిదిద్దిన తీరు గ్రాండియర్ ని మించి ఉంటుందట.