మూణ్నాలుగు రోజులుగా కోలీవుడ్ చర్చలన్నీ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూర్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లియో సినిమాలో తనకు త్రిషకు మధ్య కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. త్రిషతో కలిసి సినిమా చేస్తున్నానంటే.. ఆమెతో రేప్ సీన్లు ఉంటాయని ఆశించానని.. కానీ అలాంటివేమీ దర్శకుడు పెట్టలేదని అతనన్నాడు.
ఈ వ్యాఖ్యల మీద తీవ్ర దుమారమే రేగింది. స్వయంగా త్రిషనే ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టు పెట్టింది. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్.. ఇంకా ఎంతోమంది సెలబ్రెటీలు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఇండస్ట్రీలో ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో నడిగర్ సంఘం.. మన్సూర్ మీద సస్పెన్షన్ కూడా విధించింది. ఐతే ఇంత జరిగినా మన్సూర్‌లో అసలు పశ్చాత్తాప భావమే కనిపించకపోవడం ఆశ్చర్యకరం.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వాటిని వక్రీకరించారని ఇప్పటికే ఓ వివరణ ఇచ్చిన మన్సూర్.. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో మాట్లాడుతూ.. తాను ఎవ్వరికీ క్షమాపణ చెప్పబోనని తేల్చేశాడు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లుగా అతను మాట్లాడాడు. నడిగర్ సంఘం తనపై సస్పెన్షన్ విధించడాన్ని అతను తప్పుబట్టాడు.
ఈ విషయమై ఎవరినీ విచారించకుండానే నిర్ణయం తీసుకున్నారని.. వాళ్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి నాలుగు గంటల సమయం ఇస్తున్నట్లు చెబుతూ అతను అల్లిమేటం విధించడం గమనార్హం. మీడియా వాళ్లు తనను ప్రశ్నలు అడుగుతుంటే.. జనగణమన పాడేసి వెళ్లిపోవడం గమనార్హం. మన్సూర్ ప్రవర్తనతో అతడిపై విమర్శల జడి ఇంకా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates