మామూలుగా వేసవి వచ్చిందంటే క్రికెట్ ప్రియులకు పండగే. ఏప్రిల్, మే నెలల్లో క్రికెట్ ప్రియుల ఫేవరెట్ టోర్నీ ఐపీఎల్ ఉర్రూతలూగిస్తుంది. కానీ కరోనా పుణ్యమా అని అన్నిట్లాగే ఆ వినోదానికీ గండి పడింది. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉండదేమో అన్న అనుమానాలూ కలిగాయి. కానీ బీసీసీఐ కష్టపడి యూఈఏలో లీగ్‌కు సన్నాహాలు చేసింది.
సెప్టెంబరు 19 నుంచి ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జట్లూ అక్కడికి చేరుకున్నాయి. ఐతే ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పేసర్ దీపక్ చాహర్ సహా సహాయ సిబ్బంది పది మంది దాకా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఇది చెన్నై జట్టుకే కాదు.. మొత్తం ఐపీఎల్‌కు గట్టి ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు. ఇది చాలదన్నట్లు చెన్నై టీంకు, ఐపీఎల్‌కు మరో షాక్ తగిలింది.
ఐపీఎల్ టాప్ ప్లేయర్లలో ఒకడు.. ‘మిస్టర్ ఐపీఎల్’ అని పేరు కూడా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా.. లీగ్ నుంచి తప్పుకున్నాడు. అతను వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమవుతున్నట్లు చెన్నై జట్టు ప్రకటించింది. అతను వెంటనే స్వదేశానికి బయల్దేరాడు. ఈ ఏడాది లీగ్ మొత్తానికి రైనా అందుబాటులో ఉండడని కూడా ప్రకటన వచ్చేసింది.
ఐతే కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకుని భార్యతో ఇద్దరు పిల్లలతో సంతోషంగా కనిపిస్తున్న రైనా.. ఉన్నట్లుండి ఐపీఎల్ నుంచి ఇలా దూరం కావాల్సినంత వ్యక్తిగత సమస్యలు అతడికేం ఉన్నాయో అర్థం కావడం లేదు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలేమైనా బయటపడ్డాయా అని సందేహిస్తున్నారు.
ఆగస్టు 15న ధోని రిటైరైన రోజు కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌కు అతను అంకితం అవుతాడనుకుంటే.. ఇలా అర్ధంతరంగా లీగ్ నుంచి తప్పుకోవడం ఐపీఎల్ ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates