భక్తి చిత్రానికి ఫారిన్ షూటింగ్.. మంచు విష్ణు క్లారిటీ

మన పురాణాల ఆధారంగా తెరకెక్కే భక్తిరస చిత్రం అంటే.. మన నేటివిటీలో తీస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. ఇక్కడి లొకేషన్లు.. ఇక్కడి మనషులు.. ఈ నేటివిటీలో ఉంటేనే మన వాళ్లు ఓన్ చేసుకుంటారు. వేరే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. మైథలాజికల్ మూవీస్‌కు ఫారిన్ లొకేషన్లలో షూటింగ్ అంటే ఏదోలా అనిపిస్తుంది. మంచు విష్ణు కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’కు సంబంధించి నేరుగా న్యూజిలాండ్‌లో షూటింగ్ మొదలుపెట్టడమే.. అక్కడే ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూల్ జరుగుతుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

భక్తి చిత్రానికి ఫారిన్ లొకేషన్ ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ సందేహాలకు మంచు విష్ణు స్వయంగా సమాధానం ఇచ్చాడు. ‘కన్నప్ప లాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని మంచు విష్ణు తాజాగా ఒక పిక్‌తో పాటుగా పోస్టు పెట్టాడు. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ లాంటి సినిమాలను న్యూజిలాండ్‌లోనే షూట్ చేశారని.. తాము కూడా ఇలాంటి వాతావరణంలోనే ‘కన్నప్ప’ సినిమా తీయాలని ఫిక్సయి అక్కడ షూట్ చేస్తున్నామని వెల్లడించాడు.

దేవుడి సృష్టిలో న్యూజిలాండ్ ఒక అందమైన పెయింటింగ్ లాంటిదని.. కన్నప్ప చిత్రానికి న్యూజిలాండ్ పర్ఫెక్ట్ లొకేషన్ అని.. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కథలోని ఎమోషన్‌ను ఇక్కడి లొకేషన్లు ఎలివేట్ చేస్తాయని అతనన్నాడు. ప్రేక్షకులకు ఒక మరిచిపోలేని అనుభూతిని కన్నప్ప ఇస్తుందని విష్ణు ధీమా వ్యక్తం చేశాడు. బహుశా న్యూజిలాండ్‌లోని ప్రకృతి అందాలను ఉపయోగించుకుని ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాలన్నది విష్ణు అండ్ టీం ఆలోచన కావచ్చు. మరి కథ వేరే దేశంలో నడుస్తున్న భావన కలగకుండా.. మన నేటివిటీ ఫీల్ పోకుండా ప్రేక్షకులను ఎలా ఒప్పించి మెప్పిస్తారన్నది ఆసక్తికరం. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు.