ఆదికేశవా.. ఇంకాస్త సౌండ్ పెంచవా

హీరో ఎవరైనా ఎలాంటి జానర్ లో సినిమా నిర్మించినా దాని ప్రమోషన్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఓపెనింగ్స్ నుంచే దెబ్బ పడటం మొదలవుతుంది. ఈ మధ్య తక్కువ బడ్జెట్ లో తీసిన చిన్న చిత్రాలు సైతం పబ్లిసిటీ విషయంలో ఖర్చు ఎక్కువవుతున్నా సరే వెనుకడుగు వేయకుండా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇంకో పదే రోజుల్లో వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ ఆదికేశవ నవంబర్ 10 విడుదల కాబోతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామ్యం కావడంతో ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ ఉంటుంది. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్నా సరే సౌండ్ మాత్రం సరిపోవడం లేదు.

ఆదికేశవకు ఇప్పటిదాకా టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చాయి తప్పించి ట్రైలర్ ఇంకా వదల్లేదు. ఇంకో వారంలో ఆ లాంఛనం కూడా చేస్తారు కానీ ముందుగా ప్లాన్ చేయడం వల్ల జనాలకు త్వరగా రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వైష్ణవ్ తేజ్ బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. కొండ పొలం, రంగ రంగ వైభవంగ రెండు డిజాస్టర్స్ పడ్డాక మార్కెట్ రిస్క్ లో పడింది. ఎంత మేనల్లుడైనా సరే మెగా ఫ్యాన్స్ అందరూ పొలోమని మొదటి రోజు థియేటర్లకు పరిగెత్తడం లేదు. అది వైష్ణవ్ కూ తెలుసు. ఆదికేశవ హిట్టు కొడితేనే తిరిగి ట్రాక్ లో పడొచ్చు. లేదంటే తర్వాత సినిమాలకు రిస్క్ అవుతుంది.

శ్రీలీల హీరోయిన్ కావడం ఆదికేశవకు గ్లామర్ పరంగా ప్లస్ అవుతున్నా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తీసుకున్న టెంపుల్ బ్యాక్ డ్రాప్ ని వీలైనంత ఎక్కువ హైలైట్ చేయాలి. అసలే టీజర్ వచ్చిన టైంలో ఆచార్య షేడ్స్ కనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మళ్ళీ అలా వినిపించకూడదంటే ట్రైలర్ తో పాటు పోస్టర్లు మాట్లాడాలి. లీలమ్మో పాట తప్ప యూట్యూబ్ లోనూ దీనికి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సైతం హైలైట్ కావాలి. అసలే టైగర్ 3, జపాన్, జిగర్ తండా లాంటి డబ్బింగ్ మూవీస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. వాటిని తక్కువంచనా వేయకుండా ఆదికేశవ పోరాడాల్సి ఉంటుంది.