మధ్యతరగతి కుటుంబానికి ‘పిండం’ భయం

ఎన్ని వందల సినిమాలు వచ్చినా హారర్ జానర్ కుండే ఫాలోయింగ్ వేరు. కథాపరంగా మరీ కొత్తదనం చూపించలేకపోయినా ట్రీట్ మెంట్ లో వైవిధ్యం ద్వారా ఎప్పటికప్పుడు దెయ్యాల స్టోరీలతో ఆకట్టుకుంటున్న మేకర్స్ లేకపోలేదు. కొత్తగా పిండం రాబోతోంది. చనిపోయిన వాళ్లకు సంతర్పణం పెట్టే క్రమంలో కాకుల కోసం చేసే ఆహారాన్ని ఈ పదంతో పిలుస్తారు. అందుకే ఈ తరహా టైటిల్ పెట్టుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఈసారి అది జరిగిపోయింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో రూపొందిన పిండం ట్రైలర్ ని ఇవాళ రిలీజ్ చేశారు.

దెయ్యాలను పసిగట్టడంలో పేరున్న ఓ మంత్రగత్తె(ఈశ్వరిరావు)ను ఓ వ్యక్తి కలుసుకుంటాడు. ఆవిడ జీవితంలో చూసి భయానకరమైన కేసు గురించి చెప్పమంటాడు. అప్పుడావిడ దశాబ్దాల వెనక్కు వెళ్తుంది. ఓ మధ్య తరగతి కుటుంబంలోని వ్యక్తి(శ్రీకాంత్ శ్రీరామ్) ఊరి బయట ఓ ఇంట్లో భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఓ రాత్రి ఏదో ప్రార్ధన చేసుకునే టైంలో ఇంట్లో ఏదో అలికిడి వినిపిస్తుంది. అక్కడి నుంచి విచిత్ర శబ్దాలతో భయానక వాతావరణం ఏర్పడుతుంది. పాప ఒంట్లో ఆత్మ ప్రవేశిస్తుంది. అయితే దీని వెనుక ఒళ్ళు గగుర్పొడిచే గతం ఉందని తెలుస్తుంది. అదే పిండం అసలు కథ.

దర్శకుడు సాయికిరణ్ దైడా సీరియస్ నెరేషన్ తో మోస్ట్ స్కెరీ మూవీగా దీన్ని చెబుతున్నారు. విజువల్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. లైన్ పరంగా మరీ ఎప్పుడూ చూడని కాన్సెప్ట్ కాకపోయినా సన్నివేశాల్లో ఉన్న డెప్త్ డిఫరెంట్ గా అనిపిస్తోంది. అసలైన ట్విస్టులు దాచి పెట్టినట్టే ఉన్నారు. టీజర్ అన్నారు కానీ మూడు నిమిషాలకు దగ్గరగా ట్రైలర్ లెన్త్ ఇచ్చారు. కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చగా సతీష్ మనోహరన్ ఛాయాగ్రహణం అందించారు. ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, మాణిక్ రెడ్డి ఇతర తారాగణం. ఆత్మలు దెయ్యాల సినిమాలు ఇష్టపడే వాళ్లకు పిండం కనెక్ట్ అయితే హిట్టు పడ్డట్టే.