భగవంత్ టార్గెట్ రీచ్ అయినట్లే

దసరా సినిమాల్లో టాక్ పరంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది ‘భగవంత్ కేసరి’నే. కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు ఆశించినంత హైప్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి. దీంతో పోలిస్తే అనువాద చిత్రం అయిన ‘లియో’నే బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేసింది. తొలి రోజు టాక్ పరంగా ‘భగవంత్ కేసరి’ పైచేయి సాధించినా సరే.. కలెక్షన్ల విషయంలో ‘లియో’ తగ్గలేదు.

తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ‘భగవంత్ కేసరి’ రెండో రోజు ఇంకా తక్కువ కలెక్షన్లతో సరిపెట్టుకోవడంతో ఈ సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే రూ.60 కోట్లకు పైగా షేర్ సాధిస్తేనే ‘భగవంత్ కేసరి’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో హిట్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా ఈ సినిమా ‘హిట్’ అనిపించుకుంటుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కానీ క్రమ క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ వెళ్లిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. దసరా పండుగ సెలవులను బాగా వాడుకున్నది ఈ చిత్రమే. సోమవారం పండుగ రోజు, ఆ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా వచ్చాయి. వీక్ డేస్‌లోనూ మంచి ఆక్యుపెన్సీలు రావడం సినిమాకు కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.80 కోట్లకు పైగా గ్రాస్, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

ఈ వారం ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిన్న సినిమా మినహాయిస్తే చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ‘భగవంత్ కేసరి’ డామినేషన్ కొనసాగడం ఖాయం. ఇంకో వారం పాటు అదే బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవబోతోంది. కాబట్టి ఇంకో పది కోట్ల షేర్ సాధించడం, బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేమీ కాదు. బయ్యర్లకు ఓ మోస్తరుగా లాభాలు కూడా అందించబోతోందీ చిత్రం. కాబట్టి బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ దక్కినట్లే.