భోళా శంకర్ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల ప్రభావం వల్ల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిపోయి దాని స్థానంలో వసిష్ఠ ప్యాన్ ఇండియా మూవీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న అధికారికరంగా ప్రకటించేశారు. ఇది యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా చోటా కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతగా చేయాల్సిన సినిమాని అనుకోకుండా పక్కకు తప్పించారని అందరూ అనుకున్నారు కానీ డైరెక్టర్ కాంబో మారి మెగా 157గా రెడీ కానుంది.
విశాల్ అభిమన్యుడుతో డెబ్యూ రూపంలోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పీఎస్ మిత్రన్ కి చిరంజీవి ఓకే చెప్పడం హఠాత్తుగా జరిగిన ఘట్టం కాదు. దీని వెనుక చిన్న కథుంది. కార్తీ సర్దార్ రిలీజయ్యాక మిత్రన్ చిరుని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడు. ఇంప్రెస్ అయిన మెగాస్టార్ పూర్తి వెర్షన్ డెవలప్ చేయమని చెప్పారు. అప్పటికింకా ఆచార్య రిలీజ్ కాలేదు. వాల్తేరు వీరయ్య నిర్మాణంలో ఉంది. నిర్మాత ఎవరనేది తర్వాత డిసైడ్ చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. మిత్రన్ చెప్పింది సీరియస్ సబ్జెక్టు. సోషల్ ఇష్యూ లేనిదే ఇతను స్టోరీలు రాసుకోడు.
అభిమన్యుడులో ఆన్ లైన్ మోసాలు, శివ కార్తికేయన్ శక్తిలో ఎడ్యుకేషన్ మాఫియా, కార్తీ సర్దార్ లో నీటి పొల్యూషన్ మీద చర్చించాడు. చిరంజీవికి చెప్పిన కథలోనూ ఈ తరహా అంశం ఉందట. అయితే కమర్షియల్ సినిమాల్లోనే తనను ప్రేక్షకులు కోరుకుంటున్నారనే లెక్కలో ఉన్న చిరంజీవి మిత్రన్ ని వెయిటింగ్ లో పెట్టారు. ఒకవేళ భోళా శంకర్ హిట్ అయ్యి కళ్యాణ్ కృష్ణది మొదలుపెట్టి ఉంటే మిత్రన్ ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రూట్ క్లియరయ్యింది. ఇతనికిది నాలుగో సినిమా. ఠాగూర్ తరహాలో కంప్లీట్ యాక్షన్ కం మెసేజ్ ప్యాకేజ్ గా ఉంటుందని సమాచారం.