ఈ దసరాకు మూడు పేరున్న సినిమాలు మంచి హైప్ మధ్య రిలీజయ్యాయి. వాటిలో పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘భగవంత్ కేసరి’నే. ‘లియో’తో పాటు ‘టైగర్ నాగేశ్వరరావు’ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఐతే ‘లియో’ డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తూ సాగిపోతోంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.300 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. కాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.
తర్వాత కూడా డల్లుగానే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర బాగా అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది. కానీ అనుకూల పరిస్థితుల్లో, సినిమాకు వచ్చిన టాక్‌కు తగ్గట్లు ‘భగవంత్ కేసరి’ కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. తొలి రోజు నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫామ్ చేస్తూనే ఉంది. ‘వీరసింహారెడ్డి’తో పోలిస్తే ‘భగవంత్ కేసరి’ తొలి రోజు సగానికి సగం వసూళ్లు రాబట్టడం గమనార్హం.
సంక్రాంతి టైంలో వచ్చే వసూళ్లు వేరే కావచ్చు. కానీ దసరా కూడా మంచి సీజనే. ఈ టైంలో అందులో సగానికి సగం వసూళ్లే రావడం అనూహ్యం. ఇక రెండో రోజు వసూళ్లలో బాగా డ్రాప్ కనిపించింది. తొలి రోజుతో పోలిస్తే సగానికి సగం కలెక్షన్లే వచ్చాయి. 3, 4 రోజుల్లో పరిస్థితి మెరుగుపడింది కానీ.. టాక్, అనుకూల పరిస్థితుల్లో ఉండాల్సిన స్థాయిలో మాత్రం వసూళ్లు లేవు.
నాలుగు రోజుల్లో ‘భగవంత్ కేసరి’ గ్రాస్ వసూళ్లు రూ.55 కోట్లకు, షేర్ రూ.32 కోట్లకు చేరువగా ఉన్నాయి. బాలయ్య గత రెండు చిత్రాలూ దీంతో పోలిస్తే భారీగా వసూళ్లు రాబట్టాయి. నిజానికి అన్నింట్లోకి ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది మాత్రం ‘భగవంత్ కేసరి’కే అనే విషయం గమనార్హం. అయినా వసూళ్లు ఇలా ఉండటం ఆశ్చర్యకరం. బాలయ్య నుంచి ఆయన మాస్ అభిమానులు కోరుకునే మాస్ పాటలు, టెంప్లేంట్ ఎలివేషన్లు లేకపోవడం వల్ల ఆ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాకు కొంచెం దూరం కావడం మైనస్ అయి ఉండొచ్చు.