ప్రపంచ కప్ వేదికపై డుంకీ ప్రమోషన్లు

సలార్ కన్నా ముందే ప్రకటించినప్పటికీ పోటీ పరంగా షారుఖ్ ఖాన్ డుంకీకి డిసెంబర్ 22న క్లిష్ట పరిస్థితులు ఎదురు కాబోతున్న మాట వాస్తవం. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ప్రభాస్ స్టామినాని తట్టుకుని సౌత్ మార్కెట్ లో నిలబడగలదా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేదు. అయినా సరే రెడ్ చిల్లీస్ సంస్థ వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకుంది. వాయిదా వేయాలని డిస్ట్రిబ్యూటర్ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఒక దక్షిణాది సినిమాకు జడిసి వెనకడుగు వేస్తే అభిమానుల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని షారుఖ్ భావిస్తున్నారట.

ప్రస్తుతం టీమ్ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది. టీజర్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 12న సల్మాన్ ఖాన్ టైగర్ 3 థియేటర్లలో దీని స్క్రీనింగ్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఎలాగూ కండల వీరుడి సినిమాలో షారుఖ్ క్యామియో చేశాడు కాబట్టి అన్ని రకాలుగా ఇది మంచి ప్లాన్. నవంబర్ 19న వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగబోయే అహ్మదాబాద్ ఈవెంట్ లో డుంకీని అఫీషియల్ గా లాంచ్ చేసే ప్రతిపాదన ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని టాక్. ఇండియా టీమ్ ఎలాగూ ఖచ్చితంగా చివరి పోరులో ఉంటుందనే నమ్మకంతో ఆ మేరకు దానికి తగ్గ ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారట.

సలార్ ఎంత దూకుడుగా కనిపిస్తున్నా సరే డుంకీలో ఉన్న అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం షారుఖ్ టీమ్ లో ఉంది. థియేటర్ల పంపకాలు ఆల్రెడీ పెద్ద తలనెప్పిగా మారాయి. డుంకీ కోసం ఏకంగా పెన్, రిలయన్స్, ధర్మా లాంటి బడా సంస్థలు రంగంలోకి దిగి తమ పలుకుబడితో స్క్రీన్లను బ్లాక్ చేసే పనిలో ఉన్నాయని ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఇప్పటికే వెయ్యికి పైగా థియేటర్లతో ఒప్పందాలు చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ప్రభాస్, షారుఖ్ బృందాలు నువ్వా నేనానే రీతిలో పబ్లిసిటీ యుద్ధం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.