దగ్గుబాటి కుటుంబం నుంచి చవ్చిన కొత్త వారసుడు అభిరామ్‌కు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవమే ఎదురైంది. సీనియర్ దర్శకుడు తేజ అతణ్ని పరిచయం చేస్తూ తీసిన ‘అహింస’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఎప్పుడూ బజ్ తెచ్చుకోలేకపోయింది. రిలీజ్ ముంగిట కూడా సినిమా మీద నెగెటివిటీనే కనిపించింది తప్ప.. ఏమాత్రం సానుకూల సంకేతాలు లేకపోయాయి. ఇక రిలీజ్ తర్వాత ఏమైందో తెలిసిందే. సినిమా వచ్చింది వెళ్లింది కూడా తెలియనట్లుగా అయిపోయింది.
మామూలుగా పెద్ద కుటుంబాలకు చెందిన వారసుల సినిమాలు రిలీజవుతుంటే.. ఆయా ఫ్యామిలీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఆ హీరోను ప్రమోట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తాయి. బాగా ఖర్చు పెట్టుకుంటాయి. కానీ సురేష్ బాబు మాత్రం ‘అహింస’ విషయంలో ఏం పట్టనట్లు ఉండిపోయారు. ‘అహింస’ తర్వాత కూడా అభిరామ్ కెరీర్‌ను సురేష్ బాబు పట్టించుకున్న సంకేతాలు కనిపించలేదు. అసలు ఫ్యామిలీ అంతా అభిరామ్‌ను దూరం పెట్టిందనే రూమర్లు వినిపించాయి సోషల్ మీడియాలో.
మరోవైపు అభిరామ్‌కు కొత్తగా ఏ అవకాశాలు వచ్చినట్లుగా కూడా కనిపించలేదు. ఈ విషయాలపై అభిరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తనను ఫ్యామిలీ దూరం పెట్టిందని, తనకు కొత్త అవకాశాలు లేవనే రూమర్లను అతను ఖండించాడు. ‘‘అహింస తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నటుడిగా నేనింకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అర్థమైంది.
అందుకే కాస్త సమయం కావాలని దర్శక నిర్మాతలకు చెప్పా. నేను పూర్తిగా సిద్ధమయ్యాక ప్రేమకథలు చేయాలనుకుంటున్నా. నన్ను మా కుటుంబ సభ్యులు దూరం పెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. నాపై వివాదాలు వచ్చినపుడు కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడాను. మా తాతయ్య చనిపోయాక జీవితం విలువ తెలిసింది. ఇకపై బాధ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే సొంతంగా ‘రైటర్స్ కేఫ్’ పేరుతో హైదరాబాద్‌లో కేఫ్ మొదలుపెట్టా’’ అని అభిరామ్ తెలిపాడు.