చంద్రముఖి డిజాస్టర్.. లారెన్స్ వేదాంతం

సూపర్ స్టార్ రజినీకంత్ బ్లాక్‌బస్టర్ మూవీకి ఆల్రెడీ తెలుగులో చేసిన సీక్వెల్ ‘నాగవల్లి’ చాలదని కొత్తగా తమిళంలో ‘చంద్రముఖి-2’ పేరుతో మరో సీక్వెల్ తీశాడు సీనియర్ దర్శకుడు పి.వాసు. మళ్లీ దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రోమోలు చూసినపుడే ఇది ఆడటం కష్టమని అర్థమైపోయింది. ఇక రిలీజ్ తర్వాత అంచనాలు ఏమీ మారలేదు. తమిళంలో కూడా సరిగా ఆడని ఈ చిత్రం.. తెలుగులో అయితే కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది.

దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ కథనే నటీనటులను మార్చి తీసినట్లుందే తప్ప.. ఇందులో కొత్తగా ఏమీ అనిపించలేదు. ఇలాంటి సినిమా ఇప్పుడు ఆడుతుందని ఎలా అనుకున్నారో అని ‘చంద్రముఖి-2’ చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. లారెన్స్ తెలిసి తెలిసీ ఒక డిజాస్టర్ మూవీలో నటించారే అని అతడిపై జాలిపడ్డారు.

లారెన్స్ ఆ సినిమా సంగతి పక్కన పెట్టేసి తన కొత్త చిత్రం ‘జిగర్ తండ డబుల్ఎక్స్’ ప్రమోషన్ల మీద దృష్టిపెట్టాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 10న రిలీజ్ కాబోతోంది. దీన్ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియా సమావేశానికి హాజరైన లారెన్స్.. చంద్రముఖి-2 ఫ్లాప్ కావడంపై మీడియా వాళ్ల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

ఈ సినిమా ఎందుకు పోయిందో, రిజల్ట్ మీద స్పందన ఏంటో చెప్పకుండా అతను వేదాంతం మాట్టాడాడు. ‘‘చంద్రముఖి-2 చేసినందుకు నాకు డబ్బులు వచ్చాయి. పైగా నలుగురు హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశా. జీవితంలో అన్నీ మనం గెలవాలని లేదు. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ అయితే చాలు అనుకున్నా. అక్కడి నుంచి దర్శకుడిని అయ్యా. హీరోగా చేస్తున్నా. ఈ గ్లామర్ పెట్టుకుని హీరో అవకాశాలు రావడమే దేవుడు ఇచ్చిన వరం. మళ్లీ అందులో ఫ్లాపులు హిట్లు అని ఆలోచించకూడదు. అవి మన వెనకాలే వస్తాయి’’ అంటూ వేదాంత ధోరణిలో సమాధానం ఇచ్చాడు లారెన్స్.