ప్రయోగాలు సరే ఫలితాలే రావడం లేదు

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కష్టపడే విషయంలో ముందు వరసలో ఉన్న సుధీర్ బాబు మెచ్చుకునే ప్రయోగాలు చేస్తున్నాడు కానీ దానికి తగ్గట్టు ఫలితాలే రావడం లేదు. తాజాగా విడుదలైన మామా మశ్చీంద్ర సైతం డిజాస్టర్ బాట పట్టడం ఊహించనిది. ట్రిపుల్ రోల్ చేసి అందులో ఒక పాత్ర కోసం ప్రొస్తటిక్స్ మేకప్ ద్వారా స్థూలకాయుడిగా కనిపించడం లాంటి రిస్క్ చేశాడు. అయినా దర్శకుడు హర్షవర్ధన్ టిపికల్ కథని హ్యాండిల్ చేసిన విధానం తేడా కొట్టడంతో ఆడియన్స్ అంగీకరించలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ గడిస్తే చాలానే రీతిలో థియేటర్ వసూళ్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి.

నిజానికి సుధీర్ బాబు చేస్తున్న ఎక్స్ పరిమెంట్లు స్టోరీ పర్మగా మంచివే. ఇంతకు ముందు హంట్ లో కూడా ఏ తెలుగు హీరో చేయని నెగటివ్ షేడ్ ని ఎంచుకున్నాడు. తీరా చూస్తే మన ప్రేక్షకులు అలాంటివి అంగీకరించరన్న అనుమానమే నిజమయ్యింది. కృతి శెట్టి టైటిల్ రోల్ లో పెట్టినా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిని కేవలం ఇంద్రగంటి మోహనకృష్ణ మీద నమ్మకంతో చేస్తే బూమరాంగ్ అయ్యింది. శ్రీదేవి సోడా సెంటర్ సైతం విభిన్న ప్రయత్నమే. కులాల అంతరాలను కరుణ కుమార్ హృద్యంగా చూపించినా కథనంలో కొత్తదనం లేకపోవడం తిరస్కారానికి దారి తీసింది.

సమ్మోహనం తర్వాత సుధీర్ బాబుకి హిట్టు పడలేదు. సిక్స్ ప్యాక్ చేసినా, రిస్క్ అనిపించే సినిమాల్లో నటించినా కనీస ఫలితం రాకపోవడం ఎవరికైనా నిరాశ కలిగించేదే. ఇప్పుడు తన ఆశలన్నీ హరోంహర మీద ఉన్నాయి. ఒక్క సినిమా అనుభవమున్న జ్ఞాన సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సీరియస్ పీరియాడిక్ డ్రామా. దీంతో ఖచ్చితంగా బ్రేక్ దక్కుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. డిసెంబర్ విడుదల అనుకున్నారు కానీ సలార్ వల్ల వాయిదా పడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా ఆపై నెలలో రిలీజ్ కావొచ్చు. ఇదైనా తను కోరుకున్న సక్సెస్ ఇవ్వాలి.