లియో రహస్యాలు చాలా చెబుతున్నాడు

దసరాకు విడుదల కాబోతున్న విజయ్ లియో మీద అంచనాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఓవర్సీస్ లో జరుగుతున్న అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకు షాక్ కొడుతోంది. రిలీజ్ నాటికి ఇండియాలోనూ హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని టీమ్ ధీమాగా ఉంది. ఇక దీనికి సంబంధించిన విశేషాలను తమిళ మీడియాతో పంచుకోవడం మొదలుపెట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇందులో రోలెక్స్ తరహాలో ఒక షాకింగ్ క్యామియో ఉంటుందని అన్నాడు. కానీ ఎవరు అనేది మాత్రం టాప్ సీక్రెటట.

ఫ్యాన్స్ మాత్రం అది రామ్ చరణ్ నేనని ఊహించేసుకుంటున్నారు. ఇది కొద్దిరోజులు సస్పెన్స్ గానే ఉండబోతోంది. సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలు పూర్తిగా తీసేయమని చెప్పిందని, 18 వయసు దాటిన వాళ్ళు సైతం చూడలేనంత వయొలెన్స్ వాటిలో ఉంటుందని సెలవిచ్చాడు. కొన్ని డైలాగులను మ్యూట్ చేయమని చెప్పారట. ఇవన్నీ అలాగే ఉంచితే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారనే ఉద్దేశంతో ఒప్పుకున్నట్టు చెప్పాడు. హైనాతో ఫైట్ టెర్రిఫిక్ గా ఉంటుందని, విజువల్ ఎఫెక్ట్స్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటూనే ఉంటారని తెగ ఊరించేశాడు.

విడుదల చేయాల్సిన పాటలు మరో మూడు ఉన్నాయి. వాటిలో ఐ యాం స్కేర్డ్ అనే ఇంగ్లీష్ సాంగ్ లోకేష్ కి అన్నింటిలోకి ఫెవరెట్. అనిరుద్ రవిచందర్ బీజీఎమ్ ట్రైలర్ లో ఎలా అనిపించినా థియేటర్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. విజయ్ వాడిన బూతు పదం మీద విమర్శల గురించి మాట్లాడుతూ ఆరు నిమిషాల పాటు సాగే సింగల్ షాట్ సీన్ తర్వాత ఈ మాట ఉంటుందని, అది చూశాక పెట్టడమే కరెక్టని అంటారని హామీ ఇస్తున్నాడు. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ దక్కించుకోబోతున్న లియో హైప్ సంగతి ఎలా ఉన్నా లోకేష్ మాటలు మాత్రం గతంలో ఏ సినిమాకి చెప్పని రేంజ్ లో ఊరిస్తున్నాయి.