రన్బీర్ యష్ సాయిపల్లవితో రామాయణం

ఆదిపురుష్ దెబ్బకు మళ్ళీ ఎవరు రామాయణం జోలికి వెళ్లరేమో అనుకుంటున్న టైంలో బాలీవుడ్ లో మాత్రం ఆ దిశగా పెద్ద అడుగులే పడుతున్నాయి. రన్బీర్ కపూర్ రాముడిగా దర్శకుడు నితేష్ తివారి మూడు భాగాల భారీ ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు ముంబై అప్డేట్. ఈ వార్త గతంలోనే వచ్చినప్పటికీ సీతగా అలియా భట్ నటించేందుకు సుముఖత చూపించడంతో ఈ ప్రాజెక్టు ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ స్థానంలో తాజాగా సాయిపల్లవి వచ్చి చేరడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగమందుకున్నట్టు తెలిసింది. ఇంకో రెండు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

అసలు ట్విస్టు ఇది కాదు. రావణాసురుడిగా నటించేందుకు కెజిఎఫ్ ఫేమ్ యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఫస్ట్ పార్ట్ కోసం పదిహేను రోజులు కాల్ షీట్స్ ఇచ్చి రెండో భాగంలో తన పాత్ర కీలకం కాబట్టి అప్పుడు ఎక్కువ డేట్స్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందట. రామసీత అనుబంధాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్ లో చూపించి సీక్వెల్ నుంచి యష్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నట్టు వినికిడి. అయితే ఇమేజ్ దృష్ట్యా యష్ దీనికి ఒప్పుకుంటాడో లేదోననే సందేహాలు చాలా తలెత్తినా ఫైనల్ గా ఎస్ చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

బడ్జెట్ ఎంతనేది చెప్పలేదు కానీ ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు ఎవరూ ఖర్చు పెట్టనంత మొత్తం ఉంటుందని అంటున్నారు. ఈ ముగ్గురి రెమ్యునరేషన్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయట. మళ్ళీ వేరొకరు రామాయణం తీసే సాహసం చేయలేనంత అద్భుతంగా నితేష్ తివారి ప్లాన్ చేసినట్టుగా నార్త్ మీడియా తెగ ఊదరగొడుతోంది. అయితే వందల సార్లు చూసేసిన రాముడి గాథ మరోసారి గొప్పగా చూపించడమంటే కత్తి మీద సామే. అయినా ఇంత రిస్క్ కు సిద్ధపడటం చూస్తే స్క్రిప్ట్ బలంగా రాసుకున్నట్టు ఉన్నారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.