ఇక్కడ ఆడలేదు.. అక్కడ వంద కోట్లు

చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు తమిళ కథానాయకుడు విశాల్. ఐతే తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ క్రేజీ ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రొడ్డ కొట్టుడు మాస్ స్టైల్ విడిచిపెట్టి.. ఈసారి అతను కొంచెం కొత్తగా ట్రై చేశాడు. ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ వెరైటీ కథను మాస్ స్టయిల్లో డీల్ చేసిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్.. ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.

ఇందులో కొన్ని క్రేజీ ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కాకపోతే ఓవర్ ద టాప్ నరేషన్.. సినిమా అంతా గోల గోలగా ఉండటం ప్రతికూలాంశాలు. ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వచ్చాయంతే. ఈ కథను కొంచెం సటిల్‌గా డీల్ చేసి ఉంటే మన ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారేమో. మొత్తంగా మనదగ్గర ‘మార్క్ ఆంటోనీ’ యావరేజ్‌ అనిపించుకుంది.

కానీ తమిళంలో మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ ఇరగాడేసింది. విశాల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు.. ఓవరాల్ వసూళ్లలోనూ కెరీర్ రికార్డు ఇచ్చింది. తొలిసారిగా వంద కోట్ల క్లబ్బును విశాల్‌కు పరిచయం చేసింది. విడుదలైన మూడో వారాలకు కూడా బాగా ఆడుతున్న ఈ చిత్రం తాజాగా వంద కోట్ల మార్కును అందుకుంది. విశాల్ రేంజికి ఇది పెద్ద అచీవ్మెంటే.

‘మార్క్ ఆంటోనీ’ తమిళ జనాలకు విపరీతంగా నచ్చేసిందనడానికి ఇది రుజువు. విశాల్‌ను మించి ఇందులో ఎస్.జె.సూర్య హైలైట్ అయ్యాడు. అతడితో ముడిపడ్డ కొన్ని ఎపిసోడ్లను తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్‌కు కూడా వాళ్లు బాగా కనెక్టయ్యారు. మూడు వారాల తర్వాత కూడా ‘మార్క్ ఆంటోనీ’కి వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేశాడు విశాల్. ఐతే అక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి రావడంపై విశాల్ ఫిర్యాదు చేయడం.. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.