విజ‌య్ ఆంటోనీ పుట్టెడు దుఃఖంలోనూ…

క‌డుపు కోత‌ను మించిన బాధ ఇంకేదీ ఉండ‌ద‌ని అంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల‌లు ఎదిగొస్తున్న వ‌య‌సులో దూర‌మైతే ప‌డే వేద‌న అంతా ఇంతా కాదు. త‌మిళ న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోనీ ఇటీవ‌లే ఆ క్షోభ‌ను ఎదుర్కొన్నాడు. అత‌డి కూతురు మీరా మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కూతురిని పోగొట్టుకున్న బాధ‌లో కుంగిపోయి ఉన్నాడు విజయ్.

తన కూతురితో పాటే తాను కూడా చనిపోయాను అంటూ అత‌ను ఒక‌ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మాటతో విజయ్ ఎంతటి క్షోభను అనుభవించాడో అర్థం చేసుకోవ‌చ్చు.  ఇత బాధ‌లో కూడా విజయ్ ఆంటోని త‌న‌ వృత్తి ధర్మాన్ని మాత్రం వీడలేదు. పుట్టెడు దుఃఖంలోనూ త‌న కొత్త చిత్రం ర‌త్తం ప్రమోషన్స్‌ కోసం అత‌ను బయటకు వచ్చాడు.

కూతురు చనిపోయిన తొమ్మిది రోజులకు మీడియా ముందుకు వచ్చి ర‌త్తం ప్రమోషన‌ల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ కార్య‌క్ర‌మానికి అత‌ను త‌న చిన్న కూతురితో క‌లిసి రావ‌డం గ‌మ‌నార్హం. మామూలుగానే విజ‌య్ ఆంటోనీ కొంచెం మూడీగా ఉంటాడు. ఈ ఈవెంట్లోనూ అత‌ను అలాగే క‌నిపించాడు. ర‌త్తం సెప్టెంబ‌రు 28నే రిలీజ్ కావాల్సింది. కానీ మీరా మృతి నేప‌థ్యంలో ఒక వారం సినిమాను వాయిదా వేశారు.

ఈ రోజుల్లో ప్ర‌మోష‌న్లు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దీంతో విజ‌య్ ఆంటోనీ ఇంత బాధ‌లోనూ ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చాడు. త‌మిళ్ ప‌డం అనే సెన్సేష‌న‌ల్ మూవీ తీసిన సి.ఎస్.అముద‌న్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మ‌హిమా నంబియార్ క‌థానాయిక‌గా న‌టించింది. విజ‌య్ ఆంటోనీకి బిచ్చ‌గాడు-2 మిన‌హా కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేదు. ర‌త్తంతో అత‌ను బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.