ప్లాన్ B సిద్ధం చేస్తున్న సైంధవ్

సినీ వర్గాల్లో ప్రకంపనలు  సృష్టించిన సలార్ విడుదల తేదీ ఇంకా అధికారికం కాకపోయినా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇతర నిర్మాతలు అలెర్ట్ అయిపోయారు. ఒకవేళ డైనోసార్ రావడం పక్కా అయితే ఏం చేయాలనే దాని మీద పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో విక్టరీ వెంకటేష్ సైంధవ్ ఉంది. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని నెలల క్రితమే 22 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు షారుఖ్ ఖాన్ డుంకీ, ముందు వెనుకా హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ఉన్నా వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకుంది. తీరా చూస్తే ఇప్పుడు సలార్ సడన్ షాక్ ఇచ్చింది

యూనిట్ వర్గాలు ఇప్పుడు ప్లాన్ బి సిద్ధం చేసే పనిలో ఉన్నాయట. దాని ప్రకారం సైంధవ్ ని 2024 సంక్రాంతి బరిలో దింపుతారు. ప్రాజెక్ట్ కె ఎలాగూ రావడం లేదు. గుంటూరు కారం ఉన్నా సరే పండక్కు కనీసం ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలకు స్పేస్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈగల్, విజయ్ దేవరకొండ 13, హనుమాన్ లలో ఏవి ఖరారుగా వస్తాయో ఏవి డ్రాప్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. ఇవన్నీ ఆలోచించకుండా సైంధవ్ కంటెంట్ మీద దర్శక నిర్మాతలకు ధీమా ఉంది కాబట్టి జనవరి 13 రిలీజ్ చేసే ప్లాన్ కు తగ్గట్టు స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట.

మొత్తానికి పోటీ రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. సైంధవ్ మీద భారీ అంచనాలున్నాయి. క్యాస్టింగ్ ఇప్పటికే హైప్ ని అమాంతం పెంచేసింది. నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, శ్రద్ధ శ్రీనాధ్ లతో పాటు కోట్ల రూపాయలతో వేసిన సెట్టింగులు, చాలా రిస్క్ తీసుకుని చేసిన అవుట్ డోర్ షూటింగులు వగైరా వెంకీ ఫ్యాన్స్ లో విపరీతమైన నమ్మకాన్ని కలిగించాయి. హిట్ రెండు భాగాలను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసి పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ కనక సంక్రాంతికే ఫిక్స్ అయితే ఎఫ్ 2 తర్వాత వెంకీ మూవీ ఈ పండగకు వచ్చినట్టు అవుతుంది. చూడాలి మరి ఏం చేస్తారో.