అట్లీ ఎక్కువగా ఊహించుకుంటున్నాడా

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ఒక సౌత్ డైరెక్టర్ వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ సాధించడం ఖచ్చితంగా చిన్న విషయం కాదు. అలా అని జవాన్ ని ఎవరూ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అనరు. షోలే, డిడిఎల్ సరసన నిలబెట్టరు. ఒక ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీని కింగ్ ఖాన్ మోసిన విధానం, వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిన వైనం వీటిని మించి దర్శకుడు అట్లీ ప్రతిభ వెరసి ఇంత పెద్ద ఘనవిజయాన్ని సమకూర్చి పెట్టాయి. ఇప్పుడేదో ఫ్లోలో ఎగబడి చూసేశారు కానీ ఓ రెండేళ్ల తర్వాత మళ్ళీ షో వేసుకుంటే ఇంత రొటీన్ బొమ్మ ఎలా ఆడిందనే సందేహం కలిగినా ఆశ్చర్యం లేదు.

అయితే ఈ విజయం అట్లీతో మరీ అతిశయోక్తిగా మాట్లాడిస్తోందని ముంబై మీడియా వర్గాలు అతని మాటలను ఉటంకిస్తున్నాయి. జవాన్ ని ఆస్కార్ కు పంపే ఆలోచనలో ఉన్నామని చెప్పడం దీనికి పునాది వేసింది. ఎంత హిట్ అయినా సరే మరీ అకాడెమి అవార్డుకి అర్హత సాధించేంత మ్యాటర్ జవాన్ లో లేదని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇది చాలాక తనకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పిలుపులు వచ్చాయని, ఇదంతా జవాన్ వల్లేనని తాజాగా మరో ఇంటర్వ్యూలో అన్నాడు. దీంతో అట్లీ వాస్తవిక కోణంలో ఆలోచించడం లేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

అల్లు అర్జున్ లాంటి ఐకాన్ స్టార్లు తనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న టైంలో వీలైనంత డౌన్ టు ఎర్త్ ఉండటం అవసరం. ఆర్ఆర్ఆర్, బాహుబలి ఫలితాలు వచ్చాక కూడా రాజమౌళి మౌనమునిలా తన పని తాను చేసుకుంటూ పోయాడు తప్పించి ఎక్కడా తన సినిమాలకు ఈ స్థాయి ఉందని, ఖచ్చితంగా ఫలానాది సాధిస్తామని చెప్పలేదు. మొత్తం తెరవెనుక నడిపించారు. అట్లీ అంటే దుడుకుతనం కాబట్టి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతుండొచ్చు కానీ కమర్షియల్ గా తాను కొత్తగా ఆలోచించడం లేదన్న కామెంట్స్ కి  నెక్స్ట్  ఇండియా సినిమాతో అయినా సమాధానం ఇవ్వడం అవసరం.