లాక్ డౌన్ కారణంగా ఐదు నెలలకు పైగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. వాటిపై నిషేధం ఇంత కాలం కొనసాగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అన్నింటికంటే చివరగా అనుమతి ఇచ్చేది థియేటర్లకే అని ముందే అంచనా వేశారు కానీ.. మరీ ఇంత ఆలస్యమవుతుందని ఊహించలేదు.
లాక్ డౌన్ షరతులు సడలించినపుడల్లా థియేటర్లకు అవకాశమిస్తారేమో అని చూసిన వాళ్లకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఇప్పుడు థియేటర్లకు ప్రభుత్వం అనుమతులిచ్చేసినప్పటికీ.. ఈ ఏడాది థియేటర్లలో వంద శాతం కెపాసిటీతో సినిమాలు ఆడటం కలే అన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.
ఈ అభిప్రాయానికి వచ్చాకే తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్న వాళ్లు కూడా దిగి వచ్చారు. తెలుగులో సైతం ‘వి’ సహా కొన్ని పేరున్న సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయబోతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఆల్రెడీ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు.
అక్కడ గులాబో సితాబో, దిబ్ బేచారా, శకుంతలా దేవి లాంటి పెద్ద సినిమాలు ఓటీటీల్లోనే రిలీజయ్యాయి. ఇంకా లక్ష్మీబాంబ్, బుజ్: ది ప్రైడ్, సడక్-2 లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటితో పాటే విడుదలకు సిద్ధంగా ఉన్న సూర్యవంశీ, 83 సినిమాల మేకర్స్ మాత్రం తమ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసే అవకాశం లేదని ఇంతకుముందు ప్రకటించారు.
కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వీటికి కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీల్లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ రెండు సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయిన రిలయన్స్ సంస్థ మాత్రం అందుకు అవకాశం లేదని తేల్చేసింది.
థియేటర్ల పరిస్థితి త్వరలోనే మెరుగు పడుతుందని.. ఈ రెండు చిత్రాలను దీపావళి, క్రిస్మస్ సీజన్లలో వేర్వేరుగా రిలీజ్ చేయగలమనే ఆశాభావంతో ఉన్నామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ రెండు పండుగల సమయంలో కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో నడవని పరిస్థితే ఉంటే.. అప్పుడేం చేస్తారో చూడాలి మరి.