కోలీవుడ్లో బెనిఫిట్ షోల పంచాయితి

స్టార్ హీరోల కొత్త సినిమాల రిలీజప్పుడు తెల్లవారకుండానే చూసే బెనిఫిట్ షోలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేల రూపాయలు పోసైనా సరే టికెట్లను కొనేందుకు వెనుకాడరు. ఇది సౌత్ లో విపరీతంగా ఉంటుంది. అయితే తమిళనాడు సర్కారు వీటిని నియంత్రించే దిశగా ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్లకు మంగళం పాడేసి ఉదయం 9 గంటల నుంచి మాత్రమే షోలు మొదలుపెట్టాలనే నిబంధన అమలు చేస్తోంది. రజనీకాంత్ జైలర్ కు సైతం ఇది తప్పలేదు. చెన్నై కన్నా ముందు హైదరాబాద్ లో స్క్రీనింగ్ జరగడం ఇదే మొదటిసారని జనాలు మాట్లాడుకున్నారు.

ఇప్పుడిది మూవీ లవర్స్ లో స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెస్తోంది. వచ్చే నెల లియో రిలీజ్ ఉంది. దానికి కూడా ఇదే రూల్ ఉంటుందని ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. కావాలని అణిచేస్తున్నారని, దీన్ని ఎంత మాత్రం సహించమని తెగేసి చెబుతున్నారు. పోలీసులు మాత్రం మితిమీరిన అల్లరి, శబ్దాలతో బెనిఫిట్ షోలను పెద్ద రభసగా మార్చేస్తున్నారని, వీటి వల్ల వేలాది పోలీసులను బందోబస్తుకి కేటాయించడం పెద్ద సమస్యగా మారిందని అందుకే ఇవి లేకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అగ్ర హీరోలు, నిర్మాతలు దీని పట్ల సైలెంట్ గా ఉన్నారు కానీ ఒకవేళ ఈ బెనిఫిట్ షోలు కనక శాశ్వతంగా కనుమరుగైతే కోట్లలో డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం 4 గంటలకు రెండు వేలు పలికే టికెట్ తొమ్మిది దాటితే అయిదు వందలు మించి పోదు. అలా వేలాది షోల నుంచి ఎంతో సొమ్ము పోతుందో ఊహించుకోవచ్చు. స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారట. కర్ణాటకలో లేని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుందనేది ఫ్యాన్స్ వాదన. ఏపీ, తెలంగాణలోనూ ఇవి దాదాపుగా తగ్గిపోయిన నేపథ్యంలో మెల్లగా లేట్ షోలకు అలవాటు పడటం మంచిదేమో.