భలే ఛాన్స్ కొట్టేసిన మార్క్ ఆంటోనీ

మాములుగా అయితే రేపు బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన పోటీ ఉండాల్సింది. వినాయక చవితి పండగను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్న స్కంద, చంద్రముఖి 2లు సలార్ పుణ్యమాని నెలాఖరుకు వెళ్లిపోవడంతో మార్క్ ఆంటోనీకి బ్రహ్మాండమైన ఫ్రీ గ్రౌండ్ దొరికేసింది. ఒకవేళ ముందు చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అవి కూడా ఉండి ఉంటే థియేటర్ల పంపకాలు వగైరా ఇబ్బందులు చాలా ఉండేవి. ఎందుకంటే జవాన్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో నెమ్మదించలేదు.

సో ఎలా చూసుకున్నా విశాల్ కు పెద్ద రిస్క్ తప్పిపోయి గొప్ప అవకాశం దక్కింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక వెరైటీ కామెడీ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మార్క్ ఆంటోనీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా నిలబడేస్తుంది. వరస ఫ్లాపులతో విశాల్ మార్కెట్ కొంత డౌన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నా సరైన సినిమా పడితే జనం థియేటర్లకు వస్తారు. ఆ నమ్మకంతోనే ప్రమోషన్లు గట్రా జోరుగా చేసుకున్నారు. నితిన్ అతిథిగా ఇటీవలే ప్రీ రిలీజే ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఓపెనింగ్స్ పరంగా అద్భుతాలు జరగవు కానీ మార్నింగ్ షో అయ్యాక వచ్చే టాక్ కీలకంగా నిలవనుంది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన మార్క్ ఆంటోనీలో క్యాస్టింగ్ అయితే క్రేజీగానే ఉంది. ఎస్జె సూర్య, సునీల్ తదితరులతో పెద్ద సెట్టింగ్ చేసుకున్నారు. బడ్జెట్ కూడా భారీగానే అయ్యింది. విశాల్ రకరకాల గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నాడు. ఇక్కడ పోటీ సంగతి చూస్తే రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారు రాజాతో మరికొన్ని చిన్న సినిమాలున్నాయి కానీ దేనికీ బజ్ లేదు. గట్టిగ టాక్ వస్తేనే సాయంత్రానికి పికప్ అవుతాయి. ఓపెనింగ్స్ పరంగా ఎలా చూసుకున్నా విశాల్ దే పైచేయి అవుతుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటే చాలు కనీసం పది రోజుల దాకా ఢోకా ఉండదు. చూద్దాం.