ఓ మోస్తరు సక్సెస్ కూడా లేకుండా చాలా ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డాడు షారుఖ్ ఖాన్. అలాంటిది ఈ ఏడాది ఆయన బాక్సాఫీస్ సంబరం మామూలుగా లేదు. ఏడాది ఆరంభంలో ‘పఠాన్’ రూపంలో బారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కింగ్ ఖాన్. ఆ చిత్రం రూ.1200 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘జవాన్’ సైతం సంచలన వసూళ్లతో సాగిపోతోంది. కంటెంట్ అంత గొప్పగా లేకపోయినా.. మాస్ ప్రేక్షకులు, షారుఖ్ అభిమానులను అలరిస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకుంటోంది.
తొలి రోజే ఏకంగా రూ.130 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఈ చిత్రానికి. ఐతే టాక్ డివైడ్‌గా ఉన్న నేపథ్యంలో తర్వాతి రోజుల్లో సినిమా జోరు తగ్గుతుందేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. రెండో రోజు, శుక్రవారం వసూళ్లు కొంత డ్రాప్ అయ్యాయి కానీ.. శని, ఆదివారాల్లో మాత్రం ‘జవాన్’ కలెక్షన్ల మోత మోగిస్తోంది. శనివారం ‘జవాన్’ కలెక్షన్లు.. తొలి రోజును మించి రావడం విశేషం. వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా రూ.140 కోట్ల మార్కును దాటిపోయిందని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
ఇలాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమా విడుదలైన మూడో రోజు.. రిలీజ్ డే కంటే ఎక్కువగా, ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యం. మొత్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.350 కోట్లు దాటిపోయాయి. ఆదివారం కూడా ‘జవాన్’ జోరు తగ్గేలా లేదు. ఈ రోజు రూ.140-150 కోట్ల మధ్య వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అంటే రిలీజ్ వీకెండ్లోనే సినిమా రూ.500 కోట్ల మార్కును అందుకుంటోందన్నమాట. దీన్ని బట్టి ‘జవాన్’ వసూళ్ల సునామీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ‘జవాన్’ సంచలనాలు మామూలుగా లేవు. ఒక్క శనివారం మాత్రమే ఈ చిత్రం ఇతర దేశాలన్నింట్లో కలిపి 7 మిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా సింగిల్ డేలో ఏ ఇండియన్ మూవీ కూడా విదేశాల్లో ఇంత కలెక్షన్ రాబట్టకపోవడం విశేషం.