‘జీరో’ సినిమా 50 కోట్ల షేర్ కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డపుడు షారుఖ్ ఖాన్ పనైపోయిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. దాని కంటే ముందు షారుఖ్ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్లయ్యాయి. ‘జీరో’తో ఆయన జీరో అయిపోయినట్లే కనిపించాడు. ఈ దెబ్బతో మూడేళ్ల పాటు కొత్త సినిమా ఏదీ చేయలేదు షారుఖ్. చాలా గ్యాప్ తీసుకుని, కొత్త సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాడు.
తెలివిగా కొత్త చిత్రాలను ఎంచుకున్నాడు. అందులో ముందుగా వచ్చిన ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే సృష్టించింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని రిలీజ్‌కు ముందే తేలిపోయింది. ప్రి రిలీజ్ హైప్ ఆ స్థాయికి చేరుకుంది. విడుదల కంటే ముందు ఇండియాలో ఏకంగా 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఐతే విడుదల కంటే ముందు పది లక్షల టికెట్లు అమ్ముడైన సినిమాలు లేకపోలేదు. బాహుబలి, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐతే ఇప్పుడు షారుఖ్ యునీక్ రికార్డు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు.. ఒకే ఏడాది ఒక హీరో నటించిన రెండు చిత్రాలకు విడుదల కంటే ముందే పది లక్షల టికెట్లు అమ్ముడైన రికార్డు షారుఖ్ ఖాతాలో చేరబోతోంది. ‘జవాన్’ చిత్రం విడుదలకు మూడు రోజుల ముందే 7 లక్షల టికెట్ల మార్కును అందుకుంది. మంగళ, బుధ వారాల్లో ఇంకా పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడయ్యే అవకాశాలుండటంతో పది లక్షల మార్కును అందుకోవడం లాంఛనమే. పఠాన్, జవాన్ మూవీస్‌తో పఠాన్ అందుకున్న రికార్డును టచ్ చేయడం వేరే హీరోల వల్ల కాకపోవచ్చు.