2024 సంక్రాంతి పందెం వేడెక్కుతోంది. ఎవరికెవరు తగ్గేదేలే అన్న రీతిలో పండగే కావాలని పట్టుబట్టడంతో పోటీ అంతకంతా పెరుగుతోంది. ఇంకో నాలుగు నెలలే టైం ఉండటంతో ఎవరు ఉంటారు, ఎవరు డ్రాప్ అవుతారనే దాని మీద స్పష్టత రావడం లేదు. ముందు అనౌన్స్ చేసింది ప్రాజెక్ట్ Kనే అయినప్పటికీ ఆ డేట్ కి కట్టుబడే సూచనలు తగ్గడంతో మిగిలిన నిర్మాతలకు ధైర్యం వచ్చేసింది. అయితే వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటిదాకా వాయిదా గురించి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ప్రస్తుతానికి నో పోస్ట్ పోన్ అనుకునే లెక్కలు వేసుకోవాలి.
మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్ ఆరు నూరైనా సరే వచ్చే తీరాలని డిసైడయ్యాయి. విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబో మూవీని దింపే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు ఖుషి రిలీజ్ తర్వాత షూటింగ్ ని జెట్ స్పీడ్ తో పరిగెత్తించనున్నారు. దాని కోసం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని కొంత కాలం ఆపేందుకు సైతం ఒప్పించారట. ఇక ఇవాళ నాగార్జున నా సామిరంగా కూడా టీజర్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా పండక్కు వస్తానని నొక్కి చెప్పారు. సో ఇప్పటిదాకా ప్రాజెక్ట్ కెతో కలిపి అయిదు లాకయ్యాయి. వీటి మధ్య జనవరి 12 కావాలంటున్న హనుమాన్ సైతం చిన్నదేమీ కాదు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న హనుమాన్ చాలా హెవీ బడ్జెట్ తో రూపొందింది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తీశారు. గ్రాఫిక్స్ కోసమే ప్రశాంత్ వర్మ నెలల తరబడి ఆ పని మీదే ఉన్నాడు. ఇంత క్వాలిటీ కోసం కష్టపడుతున్నప్పుడు అందరు స్టార్ల మధ్య రిస్క్ చేస్తే ఓపెనింగ్సే కాదు వసూళ్ల పరంగానూ దెబ్బ పడుతుంది. పైగా బయ్యర్ల ప్రాధాన్యత మహేష్ బాబుతో మొదలై తేజ దగ్గర ముగుస్తుంది. అందుకే బాగా అలోచించి డిసెంబర్ అయితే ఎలా ఉంటుందన్న చర్చల్లో హనుమాన్ బృందం ఉన్నట్టు సమాచారం. ఏ విషయం తేలాలంటే టైం పట్టేలా ఉంది.