విక్రమ్ వేదా రీమేక్ నిజమా పుకారా

ఏదైనా రీమేక్ వార్త రావడం ఆలస్యం ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది నిజం కాకూడదు దేవుడాని మొక్కేసుకుంటున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ విషయంలో వస్తే మాత్రం వామ్మో అనేస్తున్నారు. కంబ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ వరసగా మూడు రీమేకులు చేశారు. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఏదీ వంద కోట్ల షేర్ అందుకోలేని మాట వాస్తవం. అది స్ట్రెయిట్ సినిమా వల్లే సాధ్యమని ఫ్యాన్స్ నమ్మి ఆశలన్నీ ఓజి మీదే పెట్టుకున్నారు. కేవలం డెబ్భై సెకండ్లున్న టీజర్ లో ఏముందో తెలియకుండానే సెప్టెంబర్ 2 కోసం ఓ రేంజ్ లో ఎదురు చూడటం దీనికే సాధ్యమయ్యింది.

ఇక పాయింట్ కు వస్తే విక్రమ్ వేదా రీమేక్ ని పవన్ – రవితేజ కాంబినేషన్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తీయబోతున్నట్టుగా వచ్చిన న్యూస్ గట్టిగానే చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పుడైతే ఇది వర్కౌట్ కావడం కష్టమే. ఎందుకంటే ఇదే కథని ఫ్రేమ్ టు ఫ్రేమ్ హిందీలో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద స్టార్లతో తీస్తేనే సోసోగా ఆడింది. పైగా ఒరిజినల్ వెర్షన్ సృష్టికర్తలే బాలీవుడ్ లోనూ డీల్ చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. ఎందుకంటే మాధవన్ విజయ్ సేతుపతిల అసలైన విక్రమ్ వేదాని ఆన్ లైన్ లో కొన్ని కోట్ల మంది చూసేశారు. కొత్తగా థ్రిలయ్యేందుకు అందులో ఏమి లేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇదంతా గాలివార్తేనని టాక్. నిర్మాత రామ్ తాళ్ళూరి, దర్శకుడు సురేందర్ రెడ్డికి పవన్ ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్న మాట వాస్తవమే కానీ అది విక్రమ్ వేదా కోసమైతే కాదు. ఇదే ప్రొడ్యూసర్ నేల టికెట్టు వల్ల నష్టపోవడంతో రవితేజ ఇంకో సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నాడట. కానీ కథ లేదు. జనసేన న నిర్వహణ కోసం వేగంగా సినిమాలు చేయడంలో భాగంగా రీమేకులకే ఓటు వేస్తున్న పవన్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విజయ్ తేరి నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతారా లేక దీన్ని జస్ట్ పుకారు స్టేజి దగ్గరే ఆపేస్తారా అనేది వేచి చూడాలి.