హీరోల మీద ఎంతైనా అభిమానం ఉండొచ్చు కానీ అది మేజిక్ తో పాటు లాజిక్ కు కూడా లోబడాలి. అంతే తప్ప ఇష్టమైన స్టార్ ఏం చేసినా సమర్ధించే తీరులో ఉండకూడదు. మాములుగా స్టేజి మీద ప్రాసలతో కూడిన ప్రసంగాలతో ఊపేసే బేబీ నిర్మాత ఎస్కెఎన్ నిన్న హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఇండస్ట్రీ రావడానికి స్ఫూర్తి ఇచ్చిందే మెగాస్టారని పలు సందర్భాల్లో అతనే చెప్పడం కాదు అల్లు అర్జున్ సైతం ఇతని గురించి అదే చెప్పిన సంగతి మర్చిపోకూడదు. నిన్న తన భక్తిని మరోసారి ప్రదర్శించారు ఎస్కెఎన్.
భోళా శంకర్ లో బాస్ మునుపెన్నడూ లేనంత అందంగా ఉన్నారని, కేవలం సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రాప్ లో పడి స్వయంగా అభిమానులే దాన్ని డిజాస్టర్ చేసుకున్నారని ఒక విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. అదేంటి కాస్ట్యూమ్స్ బాగుంటే సినిమా హిట్ అయ్యే పనైతే బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసిలు కుడా హండ్రెడ్ డేస్ ఆడతాయిగా. దేనికైనా కంటెంట్ ముఖ్యం. భోళా శంకర్ మీద పనిగట్టుకుని ఎవరూ బురద చెల్లలేదు. ఒకవేళ చేయాలనుకున్నా అంత వీక్ ఛరిష్మా అయితే చిరంజీవిది కాదు. అలాంటప్పుడు ఈజీగా ఎవరు డ్యామేజ్ చేయగలరు. మ్యాటర్ తేడా ఉంది కాబట్టే సినిమా పోయింది.
అసలు మూవీలోనే బోలెడు లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని హుందాగా ఒప్పేసుకుని బాస్ మళ్ళీ బ్యాక్ అవుతారని చెప్పుకున్నా సరిపోయేది. అది విడిచిపెట్టి మనమే ఫ్లాప్ చేసుకున్నామని చెప్పడం తర్కానికి అందదు. చిరంజీవి ప్రత్యక్ష హాజరు లేకపోయినప్పటికీ పలువురు అతిధులు, దర్శకులతో ఈవెంట్ బాగానే జరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో రాలేదు. అయినా గెలుపోటములకు అతీతంగా శిఖరమంత సాధించిన చిరంజీవికి మద్దతు ఇవ్వడమంటే ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కాదు, అవసరమైనప్పుడు తప్పెక్కడ జరుగుతుందో చెప్పడం కూడా అవసరమేనని గుర్తించాలి.