ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. యావరేజ్ టాక్‌తో మొదలైన సినిమాతో రూ.130 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంత సంక్రాంతి సీజన్ కలిసొచ్చినా సరే.. ఆ వసూళ్లు అనూహ్యమే. ఇంత పెద్ద హిట్ తర్వాత చిరు నుంచి వచ్చే సినిమా మీద అంచనాలు భారీగానే ఉండాలి. కానీ ‘భోళా శంకర్’ మాత్రం ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు కలిగించలేకపోయింది.
ఇది రీమేక్ అవడం.. పైగా దర్శకుడు మెహర్ రమేష్ కావడం.. ప్రోమోలు ఆకట్టుకునేలా లేకపోవడంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో హైప్ క్రియేట్ అవ్వలేదు. అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా అంతంతమాత్రంగా జరిగింది. మామూలుగా ఒక స్టార్ హీరోకు పెద్ద హిట్ పడిందంటే.. దాని వసూళ్లకు దగ్గరగా తర్వాతి చిత్రానికి బిజినెస్ జరుగుతుంటుంది. కానీ ‘భోళా శంకర్’ విషయంలో మాత్రం అలా జరగలేదు.
‘భోళా శంకర్’ టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు. థియేట్రికల్ వసూళ్ల నుంచి ఆ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నిర్మాత అనిల్ సుంకర ‘భోళా శంకర్’ హక్కులను కొన్ని ఏరియాలకు అమ్మి.. కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేశారు. ట్రేడ్ అంచనా ప్రకారం ఏ ఏరియా నుంచి ఆ సినిమా ఎంత షేర్ వసూలు చేయాలో ఒకసారి చూద్దాం. నైజాం ఏరియా టార్గెట్ రూ.22 కోట్లు కాగా.. రాయలసీమలో రూ.12 కోట్లు రాబట్టాల్సి ఉంది. చిరుకు మంచి పట్టున్న ఉత్తరాంధ్రలో ఈ సినిమా రూ.9.5 కోట్ల మేర బిజినెస్ చేసింది.
ఆంధ్రాప్రాంతంలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.25 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ రూ.6 కోట్లకు అమ్మారు. ఇండియాలోని మిగతా రాష్ట్రాలన్నీ కలిపి ఐదారు కోట్ల మధ్య బిజినెస్ చేసింది ‘భోళా శంకర్’. మొత్తంగా ఈ సినిమా రూ.80 కోట్ల మేర షేర్ రాబట్టాల్సి ఉంది. మామూలుగా చూస్తే చిరు రేంజికి ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు కానీ.. ‘భోళా శంకర్’కు లో బజ్ ఉండటం, టాక్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఇది పెద్ద టాస్కే అనిపిస్తోంది.