టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు.. మిగతా సినీ ప్రియులు.. సోషల్ మీడియాలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు ఇచ్చే ఎలివేషనే వేరుగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు అతనిచ్చే మ్యూజిక్ మన వాళ్లకు విపరీతంగా నచ్చేస్తుంటుంది. తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి అక్కడి ప్రేక్షకుల కంటే మన వాళ్లు ఎక్కువ ఎలివేషన్లు ఇస్తుంటారు. పెద్ద పెద్ద డిస్కషన్లు పెడుతుంటారు.
అంతే కాదు.. మన టాప్ స్టార్లలో ఎవరివైనా సినిమాలు మొదలవబోతుంటే.. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకోమని డిమాండ్లు చేస్తుంటారు. ఈ విషయమై హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమాకు ఇలా డిమాండ్ చేసే అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టడానికి పరోక్షంగా కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’కి కూడా ఇలాంటి డిమాండ్లే వినిపించాయి కానీ.. తమన్‌ను ఓకే చేశారు.
ఐతే అభిమానులు ఎందుకు ఇంతలా అనిరుధ్‌ను కోరుకుంటారనడానికి తాజా రుజువు.. జైలర్. రజినీకి అనిరుధ్ మేనల్లుడి వరస అనే విషయం చాలామందికి తెలియదు. కానీ అంతకంటే ముందు అతను సూపర్ స్టార్‌కు పెద్ద ఫ్యాన్ బాయ్. రజినీ సినిమాలకు అతను ఇచ్చే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇంతకుముందు ‘పేట’ సినిమాకు అతనిచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ‘జైలర్’ విషయంలోనూ అతను అదరగొట్టేశాడు. నిజానికి కంటెంట్ పరంగా ‘జైలర్’ వీక్ మూవీ. కానీ అనిరుధ్.. తన మార్కు స్టైలిష్ బీజీఎంతో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. రజినీ అభిమానులకు అనేక చోట్ల గూస్ బంప్స్ ఇచ్చాడు. ఫ్యాన్స్‌ను అతను ఎక్కడా కుదురుగా కూర్చోనివ్వలేదు. హుకుం, కావాలయ్యా పాటలు కూడా సినిమాకు ఎసెట్ అయ్యాయి.
ఈ సినిమా చూస్తున్న వేర్వేరు హీరోల తెలుగు ఫ్యాన్స్ కచ్చితంగా.. తమ హీరోలకు కూడా అనిరుధ్ ఇలాంటి మ్యూజిక్ ఇస్తే.. అభిమానులను ఉర్రూతలూగిస్తే బాగుంటుందని అనుకుంటే అతిశయోక్తి కాదు. ‘అజ్ఞాతవాసి’ ఎందుకో మిస్ ఫైర్ అయింది కానీ.. మంచి మాస్ మూమెంట్స్ ఉన్న సినిమాకు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకుంటే మ్యూజిక్‌తో మోత మోగించేస్తాడనడంలో సందేహం లేదు. తమ అభిమానులను సంతృప్తిపరచాలంటే మాత్రం టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ అనిరుధ్‌తో ఒక్క సినిమా అయినా చేయాల్సిందే.