తమిళ ట్రోలింగ్ మీద పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం

ఒక స్టార్ హీరో సినిమా బాగున్నా బాలేకపోయినా ఎలాంటి అభిప్రాయమైనా వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ వ్యక్తిగత అజెండా పెట్టుకుని ట్రోలింగ్ కి తెగబడటం మాత్రం హర్షణీయం కాదు. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా హుందాగా తమిళ పరిశ్రమకు కొన్ని విన్నపాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు అర్థం కాకో లేక మెచ్యూరిటీ లేకో వాటిని నెగటివ్ గా తీసుకున్న కొందరు అరవ యూత్ ఇప్పుడు బ్రో కంటెంట్, ఫలితాన్ని టార్గెట్ చేసుకుని వీడియోలు చేయడం అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

తమ్ముడులోని ట్రావెలింగ్ సోల్జర్ పాట లిరిక్స్ ని మార్చి బ్రో రిజల్ట్, వారాహి రాజకీయ యాత్రని వ్యంగ్యంగా వెటకారం చేస్తూ ఇద్దరు కుర్రాళ్ళు చేసిన చిన్న బైట్ విమర్శలకు తావిస్తోంది. విచిత్రం ఏమిటంటే ఇదొక నేషన్ వైడ్ పాపులారిటీ ఉన్న ప్రముఖ వెబ్ ఛానల్ లోగోతో రావడం. బ్రో భారీ వసూళ్లు కళ్ళముందు కనిపిస్తున్నాయి. టాక్ ఎంత డివైడ్ గా వున్నా కలెక్షన్లు బాగున్నాయి. అది వదిలేసి ఏదో అజ్ఞాతవాసి రేంజ్ లో డిజాస్టర్ ఇచ్చినట్టు కావాలని దెప్పి పొడిచే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం ఏమిటని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. వెంటనే దాన్ని తీసేసి క్షమాపణ చెప్పమని కోరుతున్నారు  

ఇప్పటికైతే సదరు ఛానల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది. కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలను విపరీతంగా ఆదరించే తెలుగు ప్రేక్షకులను చులకన చేసేలా ఇలాంటివి చేయడం అభ్యంతరకరమే. అయినా పవన్ చెప్పింది ఏదో పెద్ద తప్పయినట్టు కామెడీ చేయడం అజ్ఞానానికి పరాకాష్ఠ. ముందు పొన్నియన్ సెల్వన్ లాంటివి అర్ధమయ్యేతట్టు తీయమని, అది వదిలేసి మా హీరోలను లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని మన ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా స్నేహపూర్వకంగా ఉన్న వాతావరణాన్ని ఇలాంటివే కలుషితం చేస్తాయి.