ఖుషి దర్శకుడి మీద చిన్న అసంతృప్తి

రాబోయే రెండు నెలల్లో ఫీల్ గుడ్ సినిమాలు ఏమున్నాయని చూస్తే అందులో మొదటగా గుర్తొస్తున్న పేరు విజయ్ దేవరకొండ ఖుషి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో రౌడీ హీరోతో సమంతా జోడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మల్లువుడ్ సంచలనం హేశం అబ్దుల్ వహాబ్ ఇచ్చిన పాటలు ఒక్కొక్కటిగా ఛార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. ఆ మధ్య మణిరత్నం టైటిల్స్ తో వచ్చిన నా రోజా నువ్వే, నిన్న వచ్చిన టైటిల్ సాంగ్ రెండూ మెలోడీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వాళ్ళ నుంచి ఒక కంప్లయింట్ వినిపిస్తోంది.

అది దర్శకుడు శివ నిర్వాణనే పాటలు రాయడం. కథ, మాటల పరంగా అతనికి గొప్ప పట్టు ఉండొచ్చు కానీ ఇలాంటి ఆల్బమ్ కి ప్రొఫెషనల్ రైటర్ తో లిరిక్స్ రాయించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అది కొంత వరకు నిజమే అని చెప్పాలి. పదాల అల్లిక, ప్రాసలు కొంత వరకు ఓకే అనిపిస్తున్నా మరీ గొప్పగా అయితే లేవు. ఏదో ట్యూన్ కు తగ్గట్టు అల్లేసిన ఫీలింగ్ కలుగుతుంది. అదే భాస్కరభట్ల, శ్రీమణి, చంద్రబోస్ లాంటి వాళ్లయితే వీటి స్థాయి పెరిగేదన్న మాట వాస్తవం. టక్ జగదీష్ లో ఒక పాట రాశాక అదిచ్చిన కాన్ఫిడెన్స్ వల్లనేమో ఖుషికి పాటలన్నీ శివనే రాశారు.

ఎవరైతేనేం రాసేవి పదాలేగా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అదే నిజమైతే గతంలో నిర్మాతలు పోటీ పడి సిరివెన్నెల, వేటూరి గార్లతోనే ఎందుకు రాయించుకునే వాళ్ళు. కొత్తవాళ్లు బోలెడు దొరుకుతారు కదా. ప్రొఫెషనల్ అవసరం అంటే అది. శివ నిర్వాణ అసలు బాగా రాయలేదని కాదు. ఇంకా బెటర్ గా సాహిత్యం పడితే ఖుషి సాంగ్స్ మరింత పెద్దగా ఉండేదని నెటిజెన్ల అభిప్రాయం. సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఖుషి మీద విజయ్, సామ్ ఇద్దరూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వేర్వేరుగా వీళ్ళ గత చిత్రాలు భారీ డిజాస్టర్లు కావడంతో ఇది పెద్ద బ్రేక్ ఇవ్వాలని అభిమానుల కోరిక.