పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమలో అత్యంత ఇష్టమైన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. మొన్న ‘బ్రో’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా తన మిత్రుడి గురించి గొప్పగా మాట్లాడాడు పవన్. త్రివిక్రమ్ తనకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పాడు. కానీ పవన్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ మీద ఏదో పగ ఉన్నట్లుగా ఆయన్ని ట్రోల్ చేసే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
తాజాగా ‘బ్రో’ రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ మీద దాడి పతాక స్థాయికి చేరింది. నిన్న ‘బ్రో’ మార్నింగ్ షోలు పడ్డప్పటి నుంచి త్రివిక్రమ్ మీద మామూలు ట్రోలింగ్ జరగట్లేదు. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎన్నో మంచి డైలాగులు రాశారు. జీవిత సారాన్ని ప్రభోదించే మాటలు సూటిగా ప్రేక్షకుల గుండెలకు తాకుతున్నాయి. కానీ వాటన్నింటినీ వదిలేసి.. కొన్ని ప్రాస డైలాగుల మీద పడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
గురూజీ పెన్నులో పదును తగ్గిందని.. పైగా పవన్ సినిమాలంటే ఆయన ఏమాత్రం ఎఫర్ట్ పెట్టట్లేదని.. ప్రాస డైలాగులతో మొక్కుబడిగా లాగించేస్తున్నాడని ఆయన మీద పడిపోతున్నారు పవన్ ఫ్యాన్స్. కేవలం డైలాగుల విషయంలోనే కాదు.. వేరే రకంగా కూడా త్రివిక్రమ్‌ను పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. పవన్ రీఎంట్రీలో వరుసగా రీమేక్‌లు చేస్తుండటానికి త్రివిక్రమే కారణమని.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఈ మూడు ప్రాజెక్టులనూ ఆయనే సెట్ చేశాడని.. హరిహర వీరమల్లు లాంటి ఎగ్జైటింగ్ మూవీని పక్కన పెట్టించి.. పవన్‌తో ఏమాత్రం ఆసక్తి లేని రీమేక్‌లు చేయిస్తున్నది త్రివిక్రమే అని.. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయన కూడా భారీగా లాభ పడుతున్నాడని ఫ్యాన్స్ నిందిస్తున్నారు.
ఐతే త్రివిక్రమ్ ఏది చెబితే అది చేయడానికి పవన్ తెలివి లేని వాడు, చిన్న పిల్లాడు కాదు కదా.. రాజకీయ ప్రయాణం సాఫీగా సాగాలంటే పవన్‌కు డబ్బు అవసరమని.. తనకున్న అనేక పరిమితులు, సమయాభావం దృష్టిలో తక్కువ పనితో ఎక్కువ డబ్బులు సంపాదించేలా త్రివిక్రమ్ సినిమాలు సెట్ చేస్తున్నాడని.. నిర్మాతలకు కూడా లాభం చేకూరేలాగే ఆయన ప్లానింగ్ ఉంటోందని.. మరి పవన్‌కు, నిర్మాతలకు లేని ఇబ్బంది ఫ్యాన్స్‌కు ఎందుకని.. పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోవాలని ఇంకో వర్గం వాదిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates