జైలర్ వేడుకలో రజనీకాంత్ హితబోధ

తమిళ పరిశ్రమ తమ ఆర్టిస్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం గురించి జారీ చేసిన నియమనిబంధనలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ నేరుగా దీని మీదే మాట్లాడితే దానికి స్పందనగా కోలీవుడ్ తరఫున నాజర్ అలాంటిదేమి లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడారు. నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులు, ముచ్చట్లు పంచుకున్నారు. అందులో భాగంగా తెలుగు కన్నడ సినిమాల ప్రస్తావన తెచ్చారు.

ఒకప్పుడు శాండల్ వుడ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదని కెజిఎఫ్, కాంతారా లాంటి అద్భుతాల వల్ల ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ని చేరుకున్నారని కితాబిచ్చారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పలు టాలీవుడ్ కి అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని అందించాయని ప్రశంసలు గుప్పించారు. మనమూ వీటి సరసన నిలిచే గొప్ప చిత్రాలు అందించాలని హితవు పలికారు. అందరూ మన అన్నదమ్ములేనని, కలిసికట్టుగా సౌత్ ఇండస్ట్రీని పెద్దది చేసుకోవాలని, ప్రతి సినిమా థియేటర్లలో ఆడే స్థాయి అందుకోవాలని  అన్నారు. అంటే హద్దులు పెట్టుకోవద్దని నేరుగానే చెప్పేశారు.

కేవలం తమిళనాడుకి చెందినవాళ్లు మాత్రమే పనిచేయాలనే పరిమితి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేసినట్టు అయ్యింది. నిజానికి కోలీవుడ్ ఎంత పెద్ద మార్కెట్ అయినా ఇంటర్ నేషనల్ లెవల్ లో కొనియాడబడిన సినిమా ఏదీ లేదు. అంత గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు తెలుగు కన్నడ కేరళలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బొటాబొటిగా గట్టెక్కాయి. విక్రమ్ లాంటివి హిందీ మార్కెట్ లో ఆడలేదు. అందుకే ఊరికే మా సినిమాలు మావే అనుకుండా అందరినీ కలుపుకుంటూ పోతేనే ఉభయకుశలోపరిగా ఉంటుంది.