తెలంగాణలో ప్రభుత్వం అనుమతించిన ప్రకారం ఒక టికెట్ ధర 295 పెడితేనే ఒక్కోసారి ఇంత రేటా అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లాలంటే రెండు వేలకు పైగా ఖర్చు పెట్టాలాని లెక్కలు వేస్తారు. అలాంటిది వేరే రాష్ట్రంలో ఒక హాలీవుడ్ మూవీకి అక్షరాలా 2450 రూపాయల ధర నిర్ణయించడం అంటే మాటలు కాదు. ముంబై పివిఆర్ ఐమాక్స్ లోయర్ పారెల్ మల్టీప్లెక్స్ లో 21న విడుదల కాబోతున్న ఓపెన్ హెయిమర్ కు గాను ఒక రిక్లైనర్ సీటుకి నిర్ణయించిన ధర ఇది. ఇంత పెట్టి ఎవరు కొంటారా అనుకోకోండి. మీ దగ్గర నిజంగా అంత డబ్బున్నా ఆల్రెడీ వీకెండ్ దాకా అమ్ముడుపోయింది.
ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ అండ్ బిగ్ స్క్రీన్స్ లో ఓపెన్ హెయిమర్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లాంటి చోట్ల ప్రైజ్ క్యాపింగ్ ఉంది కాబట్టి ఇక్కడ సాధ్యపడటం లేదు కానీ ఛాన్స్ ఉన్న చోటల్లా డిమాండ్ ని బెట్టి దోపిడీ దండయాత్ర చేస్తున్నారు. ఇండియా వైడ్ రిలీజ్ ఇంకా మూడు నాలుగు రోజులు ఉండగానే లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. మరో షాక్ కూడా ఉంది. స్టార్ హీరోల రేంజ్లో ప్రధాన నగరాల్లో తెల్లవారుఝామున 3 గంటలకు బెనిఫిట్ షోలు వేయబోతున్నారు.
క్రిస్టోఫర్ నోలన్ కు ఉన్న క్రేజ్ కి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. అతని ఫిలిం మేకింగ్ ని ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఇంటర్ స్టెల్లార్, డార్క్ నైట్, డార్క్ నైట్ రైజెస్ స్పెషల్ షోలు వేస్తే అభిమానులు ఎగబడి మరీ వాటిని హౌస్ ఫుల్స్ చేస్తున్నారు. అలాంటిది విపరీతమైన అంచనాలున్న ఓపెన్ హెయిమర్ మీద ఇంత క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. 3 గంటల 10 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ అటామిక్ డ్రామా కనక హైప్ కు తగట్టు ఉంటే మాత్రం ఇండియాలో ఉన్న పాత హాలీవుడ్ రికార్డులన్నీ చెల్లాచెదురు కావడం ఖాయం.