కమల్ రాక వెనుక ఆ లెజెండ్

లోకనాయకుడు కమల్ హాసన్.. ప్రభాస్ మెగా మూవీ ‘ప్రాజెక్ట్-కే’లో నటించబోతున్నట్లు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తునే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ ఉండగా.. మళ్లీ కమల్ ఏంటి అన్న సందేహాలు కలిగాయి చాలామందికి. ఇది కేవలం రూమర్ అనే అనుకున్నారు. కానీ ఈ రోజు ఆ వార్తే నిజమని తేలడంతో ప్రభాస్ అభిమానులు సహా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ ఎగ్జైట్ అవుతున్నారు.

కమల్ రాకతో ఈ సినిమా రేంజే మారబోతోందనడంలో సందేహం లేదు. ఇది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్, అలాగే షాక్ కూడా. మరి ఆయన ఈ ప్రాజెక్టులోకి.. అది కూడా సినిమా షూట్ ముగింపు దశలో ఉండగా ఎలా వచ్చాడన్నది ఆసక్తికరం. కమల్ చేయాల్సిన పాత్ర విషయంలో ఇంతకుముందు ఎవరినీ అనుకోకుండానే షూట్ మొదలుపెట్టారా.. లేక ఆయన కోసం కొత్తగా పాత్ర క్రియేట్ చేశారా అనే చర్చ నడుస్తోంది.

ఐతే ఆ సంగతులు తెలియదు కానీ.. కమల్ ‘ప్రాజెక్ట్-కే’లో భాగం కావడంలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ముఖ్య పాత్ర పోషించినట్లు సమాచారం. సింగీతం తీసిన ‘ఆదిత్య 369’ తరహాలోనే ఫాంటసీ, సైంటిఫిక్ టచ్ ఉన్న చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. అందుకే ఆయన్ని ఈ సినిమా కోసం మెంటార్‌గా పెట్టుకున్నారు. స్క్రిప్టు, షూటింగ్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. తన సలహాలు ఇస్తున్నారు.

సినిమాలో ఓ ముఖ్య అతిథి పాత్రకు ఎవరిని ఎంచుకుందాం అనే చర్చ వచ్చినపుడు కమల్‌ పేరును ఆయన సూచించారని.. ఆయనే కమల్‌ను ఒప్పించారని చిత్ర వర్గాలు అంటున్నాయి. కమల్‌తో సింగీతం అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కలయికలో ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’ లాంటి క్లాసిక్స్ వచ్చాయి. కమల్ ఎంతో గౌరవించే, అభిమానించే దర్శకుల్లో సింగీతం ఒకరు. 90 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఒక సినిమాకు సేవలు అందిస్తూ.. అందులో భాగం కావాలని అడిగితే కమల్ కాదని ఎలా అనగలరు మరి?