మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనంతో ఊగిపోతున్నారు. ఇండియన్ 2 కోసం దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ కి బ్రేక్ ఇవ్వడంతో తిరిగి ఎప్పుడు మొదలవుతుందాని ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి వచ్చే అవకాశాలు శూన్యమయ్యాయి. పోనీ సమ్మర్ కి రిలీజ్ ఉంటుందా అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగమందుకుంటే తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కమల్ హాసన్ మీద ప్రత్యేక శ్రద్ధతోనే రామ్ చరణ్ ది శంకర్ పూర్తిగా పక్కన పెడుతున్నారనే అభిమానుల విమర్శకు సమాధానం దొరకడం లేదు. ట్విట్టర్ ఫ్యాన్స్ ఈ విషయం మీదే గరం గరం అవుతున్నారు.
ప్రాజెక్టు ప్రకటించి రెండున్నర సంవత్సరాలు దాటింది. ఇప్పటిదాకా అధికారికంగా బయటికి వచ్చింది బైక్ మీద చరణ్ ఇచ్చిన సైడ్ స్టిల్ మాత్రమే. హీరోయిన్,ఇతర కీలక ఆర్టిస్టులు, తమన్ పాటల గురించి అప్డేట్లు ఏమీ లేకుండా కాలాన్ని నెట్టుకొస్తున్నారు. గేమ్ చేంజర్ కన్నా చాలా ఆలస్యంగా మొదలైన ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు అప్పుడే పక్కా ప్రణాళికతో రిలీజ్ టార్గెట్ ని చేరుకోబోతున్నాయి. ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ దేవర స్టార్ట్ చేసి ఆరు నెలలు కాలేదు. కానీ ఏప్రిల్ 5 విడుదలను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా తారక్ కొరటాల శివ ప్లాన్ చేసుకున్నారు
మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ మారుతీ కాంబో మూవీ, పవన్ కళ్యాణ్ బ్రో-ఉస్తాద్ భగత్ సింగ్-ఓజి, చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఇవన్నీ గేమ్ చేంజర్ కంటే లేట్ గా మొదలుపెట్టి దాదాపు చివరి దశలో ఉన్నవి. కానీ చరణ్ ది ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోయింది. భారం మొత్తం శంకర్ మీదే ఉండటంతో నిర్మాత దిల్ రాజు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఇరుక్కున్నారు. అసలు ఏ దశలో ఉందో కూడా చెప్పడం లేదు. కియారా అద్వానీ కొత్త డేట్లను అందుకే లాక్ చేసుకోలేదట. ఈ లెక్కన 2024 దసరా లేదా దీపావళి తప్ప గేమ్ చేంజర్ కు వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు
Gulte Telugu Telugu Political and Movie News Updates