చిరు చేతుల్లో సుధాకర్ వారసుడి బాధ్యత  

ఇప్పటి తరానికి హాస్య నటుడు సుధాకర్ అంటే  అవగహన ఉండకపోవచ్చు కానీ 2000 సంవత్సరం వరకు తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసినవాళ్లకు పరిచయం అక్కర్లేదు. పితుహూ, అబ్బబ్బా అంటూ  ఒక ప్రత్యేకమైన డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను నవ్వించడం తనకే చెల్లింది. యముడికి మొగుడు, పెద్దరికం, సుస్వాగతం, రాజా లాంటి సినిమాల్లో తిరుగులేని టైమింగ్ తో ఆకట్టుకోవడం ప్రశంసలే కాదు అవార్డులు రివార్డులు తెచ్చాయి. అయితే అనారోగ్యం దృష్ట్యా చాలా కాలంగా సుధాకర్ నటనకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆయనకో వారసుడు ఉన్నారు. పేరు బెనెడిక్ మైఖేల్. మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన ఇతను ప్రస్తుతం అమెజాన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నటనంటే బాగా ఇష్టమున్న కొడుకుని తెరకు పరిచయం చేయలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ కుదరలేదు. ఫైనల్ గా ప్రాణ మిత్రుడు, ఒకప్పటి రూమ్ మేట్ మెగాస్టార్ చిరంజీవి ఆ బాధ్యత తీసుకున్నారని  ఒక టీవీ ఛానల్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వెళ్లిన సందర్భంలో సుధాకర్ స్వయంగా చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఎప్పుడు ఎవరి ద్వారా లాంటి వివరాలు వెల్లడించలేదు.

సుధాకర్ చిరు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో ఒకే రూమ్ పంచుకున్నారు. అవకాశాలు కలిసే వెతుక్కున్నారు. ముందు సుధాకర్ కే హీరోగా ఆఫర్లు వచ్చాయి. కానీ బ్రేక్ దక్కలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఛాన్సులు పెరిగి స్టార్ డం వచ్చింది. చిరంజీవి పెద్ద స్టార్ అయ్యాక  తన ఫ్రెండ్స్ సుధాకర్, నారాయణరావు, హరిబాబులను నిర్మాతలుగా చేసి యముడికి మొగుడు తీయిస్తే అది బ్లాక్ బస్టర్ కొట్టింది. వీలైనంత వరకు తన సినిమాల్లో సుధాకర్ కు వేషం ఉండేలా చిరు దర్శకులకు సూచించేవారట. అందుకే స్నేహితుడి వారసుడి బాధ్యతని తీసుకున్నారు. అదీ సంగతి.