ఆదిపురుష్ సినిమాను ముందు 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ మేరకు ఐదారు నెలల ముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు కూడా చేశారు. కానీ టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్, ముఖ్య పాత్రల మేకప్ అదీ చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పటిదాకా మరే సినిమాకూ లేని స్థాయిలో దాని మీద ట్రోలింగ్ జరిగింది.
దెబ్బకు సినిమాను వాయిదా వేసేశారు. ఐదు నెలలు ఆలస్యంగా జూన్ 16కు విడుదల తేదీని మార్చారు. ఇలా ట్రోలింగ్‌కు భయపడి రిలీజ్ డేట్ మార్చడం ఇప్పటిదాకా ఎన్నడూ జరిగి ఉండదేమో. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు మార్పులు చేర్పులు చేయడానికే ఐదు నెలలు సమయం తీసుకున్నారని అంతా భావించారు. రిలీజ్ ముంగిట ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడినపుడు కూడా సినిమా వాయిదా పడ్డాక దర్శకుడు ఓం రౌత్, ఇతర టీం సభ్యులు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడ్డట్లుగా చెప్పాడు.
ఆ మాటల్ని బట్టి చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం కరెక్షన్లు జరిగినట్లు.. రావణుడిలా కాకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీ లాగా కనిపించిన సైఫ్ అలీ ఖాన్ మేకప్ విషయంలో జాగ్రత్త పడ్డట్లు భావించారు అందరూ. అలాగే కొన్ని ముఖ్య సన్నివేశాలను రీషూట్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ట్రైలర్ చూస్తే టీజర్‌తో పోలిస్తే బెటర్‌గా కనిపించడంతో ‘ఆదిపురుష్’ ఔట్ పుట్ మారిపోయి ఉంటుందని అంచనా వేశారు. కానీ తీరా సినిమా చూస్తే.. ఐదు నెలలు సినిమాను వాయిదా వేసి వీళ్లేం చేశారసలు అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.
చిన్న చిన్న కరెక్షన్లు మినహాయిస్తే.. ప్రేక్షకుల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ గెటప్, మేకప్ ఏమాత్రం మెరుగుపడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ సంగతి సరేసరి. మరి సినిమాను ఎందుకు వాయిదా వేసినట్లు.. వీళ్లు ఏం మార్పులు చేర్పులు చేసినట్లు అన్నది అంతుబట్టడం లేదు. టీజర్లో ఒక వరుసలో ఉన్న రావణుడి పది తలలు.. రెండు వరసల్లోకి మార్చడం తప్పితే.. ఓం రౌత్ అండ్ టీం చేసిందేమీ లేదంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.