పవన్ నిర్మాతల ఉమ్మడి నిర్ణయం

వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్న తరుణంలో ఒకపక్క సినిమాల షూటింగ్స్ ని బ్యాలన్స్ చేసుకుంటూనే జనసేన కార్యకలాపాలను చూసుకోవడం పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకురానుంది. ప్రతిసారి మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లడం ఒకటి రెండు సార్లు అయితే ఇబ్బంది ఉండదు కానీ పదే పదే తిరగాలంటే మాత్రం చిక్కే. అందులోనూ ఎన్నికలు నెలల వ్యవధిలో రాబోతున్నాయి కాబట్టి పవన్ రచించబోయే రాజకీయ వ్యూహానికి తగినంత ఫ్రీ మైండ్ అవసరం. అందుకే ఆయనతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఓ మాటమీదకొచ్చారు.

నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలుసుకున్నాక అదేంటో వెల్లడించారు. ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరి హర వీరమల్లు చిత్రీకరణలు సాధ్యమైనంత మేరకు అక్కడి పరిసరాలతో పాటు విజయవాడ, గుంటూరు, అమరావతి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీని వల్ల పవన్ ను ప్రయాణ సమయం తగ్గిపోయి వేగంగా కాల్ షీట్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా జనసేన మీటింగ్స్ వల్ల వాయిదా వేయాల్సి వచ్చినా ఒకటి రెండు రోజులు సమస్యేమీ ఉండదు. కాకపోతే ఆర్టిస్టులను ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది

ఎలా చూసుకున్నా ఇది ఉభయకుశలోపరి నిర్ణయం. బ్రో ఎలాగూ పూర్తయ్యింది కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే పవన్ వస్తే చాలని సముతిరఖని టీమ్ ముందే ఫిక్స్ అయ్యింది. అది కూడా జూలై రెండో వారంలో కనక ఇంకా టైం ఉంది. డిసెంబర్ లో ఓజి విడుదల చేయాలనే దిశగా పనులైతే చేస్తున్నారు కానీ మధ్యలో ఎలాంటి బ్రేకులు పడకపోతేనే సాధ్యమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ 2024 సమ్మర్ లో, హరిహర వీరమల్లు వేసవితో పాటు ఎన్నికలు అయ్యాక రిలీజ్ చేసేలా ప్రణాళిక జరుగుతోంది. మొత్తానికి ఈ ప్లానింగ్ అయితే బాగుంది